Vijayawada Constituency: వామ్మో విజయవాడ ఎంపీ సీటు.. లగడపాటి, కేశినేని, అశ్వినీదత్ తో పాటు వాళ్లంతా ఔట్! విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన వారు శాశ్వతంగా రాజకీయాలకు దూరం అయిపోతున్నారు. లగడపాటి రాజగోపాల్, కోనేరు రాజేంద్ర ప్రసాద్, పీవీపీ గతంలో రాజకీయాలకు దూరం కాగా.. ఇప్పుడు కేశినేని నాని ఓటమితో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. By KVD Varma 11 Jun 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Vijayawada Constituency: రాజకీయాలు చాలా చిత్రంగా ఉంటాయి. అధికారంలో ఉన్న నేతలు ఎంత హంగామా చేస్తారో.. అధికారం కోల్పోతే అంత డీలా పడిపోతారు. అధికారం కోసం పోటీలో నిలిచినపుడు చాలా ధైర్యంగా.. ఎదుటి పక్షంపై విమర్శల దాడితో దూసుకుపోయే నాయకులు.. అధికారాన్ని అందుకోలేకపోతే.. పలాయనం చిత్తగించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం పార్టీ మారిపోతుంటారు.. కొద్దీ మంది మాత్రం వైరాగ్యంలోకి జారిపోయి.. రాజకీయాలకు తాత్కాలికంగానో.. శాశ్వతంగానో దూరం అయిపోతారు. కొన్ని నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు ఓటమి చెందిన వెంటనే లేదా అక్కడ పెద్ద సమస్య వచ్చిన వెంటనే రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోవడం జరుగుతుంది. అలాంటి నియోజకవర్గాల్లో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే, కొన్ని ఎన్నికలుగా.. ఇక్కడ నుంచి పోటీ చేసిన నాయకులు గెలిచినా.. ఓడినా రాజకీయాల నుంచి తప్పుకోవడం.. ఇంకా చెప్పాలంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరంగా జరిగిపోవడం ఆనవాయితీగా మారింది. Vijayawada Constituency: ఇప్పుడు ఇదెందుకు ప్రస్తావనకు వచ్చిందంటే.. ఇక్కడ నుంచి రెండు సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన కేశినేని నాని ఈ ఎన్నికల్లో ఓడిపోగానే.. రాజకీయ వైరాగ్యంతో.. శాశ్వతంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. విజయవాడలోనే కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కేశినేని నాని అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. కేశినేని ట్రావెల్స్ అధినేతగా.. తెలుగుదేశం పార్టీకి విజయవాడలో పట్టు పెంచిన నాయకుడిగా ఆయన పేరు అందరికీ తెలిసిందే. అయితే, ఆయనది చాలా ఎమోషనల్ జర్నీ. కేశినేని ట్రావెల్స్ పై ఆరోపణలు రావడంతో.. తన సంస్థను పూర్తిగా మూసేసిన నాయకుడు. ఇదిగో ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే ధోరణి. రెండుసార్లు టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా గెలిచిన ఆయనకు.. ఈసారి సీటు దక్కే ఛాన్స్ లేదని ముందుగానే తేలింది. ఆయన తమ్ముడు కేశినేని శివనాధ్ కు (చిన్నీ) అవకాశం ఇస్తారని తెలిసిన వెంటనే, నాని తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన రావడమే కాకుండా, క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా ఉన్న తన కుమార్తె శ్వేతను కూడా టీడీపీ నుంచి బయటకు తీసుకువచ్చి వైసీపీ తీర్ధం పుచ్చేసుకున్నారు. వైసీపీలో చేరిన తరువాత నానీ తీరే మారిపోయింది. విజయవాడ ఎంపీ సీటులో వైసీపీ తరఫున పోటీచేసిన ఆయన ప్రచారంలో అవతలి పక్షం నుంచి పోటీలో ఉన్నది తన తమ్ముడు అని కూడా చూడకుండా దూకుడుగా ప్రచారం చేశారు. వైసీపీ విధానంలోనే నోటికి ఎక్కువ పని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అంతే.. ఓటమితో కుంగి పోయిన కేశినేని నాని.. తానూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతున్నానని ప్రకటించారు. ఆయనతో పాటు అయన కుమార్తె కూడా వైసీపీకి రాజీనామా చేశారు. అంతకు ముందు కూడా.. Vijayawada Constituency: ఇది కేశినేని కథ అయితే, అంతకు ముందు కూడా విజయవాడ నుంచి పోటీ చేసి ఓడిపోయినా అభ్యర్థులు అందరూ రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకోవడం జరిగింది. ఇది కాకతాళీయమా? లేకపోతే శాపమా? అనేది తెలీదు కానీ.. కేశినేని నానిపై 2019లో పోటీ చేసిన పీవీపీ సంస్థల అధినేత పొట్లూరి వర ప్రసాద్ కూడా నానిపై ఓటమి చెందిన తరువాత రాజకీయాలకు దూరంగా జరిగిపోయారు. మళ్ళీ ఆయన కనీసం రాజకీయ నాయకుల పక్కన కూడా ఎక్కడా కనబడలేదు. అంతకు ముందు 2014లో నానిపై పోటీ చేసిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ దీ అదే పరిస్థితి. ఇదిలా ఉంటే, 2004 నుంచి రెండుసార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన లగడపాటి రాజగోపాల్ కూడా రాజకీయాలకు దూరం అయిపోయారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సమైఖ్యంధ్ర కోసం పోరాటం చేశారు లగడపాటి. అయితే.. తెలంగాణ ఏర్పడడంతో తన వ్యాఖ్యలకు కట్టుబడి రాజకీయాలకు దూరం అయ్యారు. అశ్వినీదత్ : ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్ టీడీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా 2004లో బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన మళ్లీ రాజకీయాల్లో కనిపించలేదు. ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి వల్లభనేని వంశీ విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. Vijayawada Constituency: మొత్తంగా చూసుకుంటే, ఇటీవల కాలంలో అంటే గత రెండు దశాబ్దాలుగా విజయవాడ లోక్ సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయిన నేతల్లో చాలా మంది వివిధ కారణాలతో రాజకీయంగా కనుమరుగు కావడం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో ఓడిపోవడం అంటే ఒక శాపంగా మారిపోతున్నట్లుందన్న చర్చ అని రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. #vijayawada #vijayawada-mp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి