తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 118స్థానాల్లో పోటి చేసిన కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలిచి తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్కార్ ను ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరో పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రూ. 350కోట్లతో విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్యూటీలను ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఎన్నికల హామీల్లో భాగంగా 18ఏళ్లు నిండిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలను ఇచ్చేందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 1784 కాలేజీలు ఉన్నాయి. పేద విద్యార్థినులు సుమారు 5లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 2లక్షల మంది మహానగర పరిధిలో ఉన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు 70వేల మంది ఉన్నారు. కేంద్రం సబ్సిడీ పోగా ఒక్కో స్కూటీకి 50వేల రూపాయల చొప్పున 70వేలస్కూటీలకు రూ. 350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే విధివిధాననాలు, దరఖాస్తు చేసుకునే వివరాల గురించి త్వరలోనే తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అర్హులను ఎలా గుర్తిస్తారనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. రేషన్ కార్డు ప్రాతిపదికగా గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే మహాలక్షమీ గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం, చేయూత గ్యారెంటీలో భాగంగా ఆరోగ్య శ్రీ బీమా కింద రూ. 10లక్షలకు పెంపు పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ యువతి సవీరా పర్కాశ్