Mancherial: మంచిర్యాల ఆర్డీవో కార్యాలయ ఆస్తుల జప్తు విషయం సంచలనం సృష్టించింది. అయితే కలెక్టర్ జోక్యంతో చివరినిమిషంలో జప్తు ఆగినట్లు తెలిసింది. మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయ ఆస్తులు జప్తు చేయడానికి సిద్ధపడిన కోర్టు సిబ్బంది కలెక్టర్ జోక్యంతో వెనుదిరిగారు. కోటపల్లి మండలం పారిపెల్లి గ్రామ భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం చేసినందుకు మంచిర్యాల రెవెన్యూ డివిజన్ కార్యాలయం(ఆర్డీఓ) ఆస్తులను జప్తు చేయాలని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Praneeth: హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్.. బ్లాక్ మెయిల్ చేసి బాగా వాడేసిన పోలీస్ బాస్!
భూనిర్వాసితులకు పరిహారం..
ఈ మేరకు కోర్టు సిబ్బంది ఆస్తుల అటాచ్డ్ వారెంట్‌తో బుధవారం కార్యాలయానికి వచ్చారు. భూనిర్వాసితులకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని లేకుంటే కార్యాలయ ఆస్తులను జప్తు చేస్తామని ఆర్డీఓ వాడాల రాములుకు తెలిపారు. ఈ విషయంపై కోర్టు సిబ్బంది, ఆర్డీఓ మధ్య దాదాపు మూడు గంటలు చర్చలు జరిగాయి. అనంతరం కోర్టు సిబ్బంది కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫర్నిచర్ సీజ్ చేసి స్టిక్కర్లు అంటించారు. చివరి క్షణంలో కలెక్టర్ బదావత్ సంతోష్ న్యాయమూర్తితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి కొంత గడువు ఇవ్వాలని కోరగా జడ్జి అంగీకరించినట్లు తెలిసింది. అనంతరం కోర్టు సిబ్బంది ఫర్నిచర్ జప్తు విరమించుకుని వెళ్లిపోయారు.