చిక్కోలు వాసులకు బిగ్ రిలీఫ్ దక్కింది. పెద్ద పులి భయం నుంచి విముక్తి కలిగింది.పెద్ద పులి భయంతో ప్రజలు భయం..భయంగా బ్రతికారు. సుమారు 33 రోజుల పాటు అటవీశాఖ సిబ్బందికి, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. చివరకు ఒడిశాకు తిరుగు ప్రయాణ అయింది పెద్ద పులి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చి గత నెల రోజులుగా ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాలోని వివిధ గ్రామాల్లో సంచరించిన పెద్ద పులి మళ్లీ ఒడిశా రాష్ట్రంలోకి వెళ్లిపోయింది. మంగళవారం ఒడిశాలోని గజపతి జిల్లా దేవగిరి అటవీ ప్రాంతం కుమిలిసింగి పంచాయతీ అనబర పరిధిలో ఓ ఆవును పులి చంపినట్లు ఆ రాష్ట్ర అటవీశాఖ అధికారులు అశోక్ కుమార్ బెహరా, ఆనంద్‌లు ధృవీకరించారు.
Also Read: ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఘర్షణకు రీజన్ ఇదే.!
గత నెల 19న ఒడిశాలోని గండాహతి ప్రాంతంలో ప్రత్యేక్షమైన పులి 21న మందస మండలం లొత్తూరులో కనిపించింది. ఆ తరువాత సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, మెళియాపుట్టి, నందిగాం, టెక్కలి, పాతపట్నం మండలాల్లో సంచరించింది. ఈ నెల 9న టెక్కలి మండలం గూడెం, 13న సరియాపల్లి, 14న జీడిపేట-భీంపురం, 17న లింగాలవలస పంచాయతీ సవర సొర్లిగాం, 18న పాతపట్నం మండలం చిన్నమల్లిపురం, సీడిపేట, 20న కొరసవాడ దరి శివరాంపురం, 21న దశరథపురం, సంగుడు, సరాళీ ప్రాంతంలో పులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు.
ఎట్టకేలకు మంగళవారం మళ్లీ ఒడిశా రాష్ట్రంలోకి ప్రవేశించి దేవగిరి అటవీ ప్రాంతంలో ఆవును చంపేసింది. ఆంధ్రాలో 9 మండలాల పరిధిలో సుమారు 33 రోజుల పాటు అటవీశాఖ సిబ్బందికి, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పులి చివరకు ఒడిశాకు చేరుకోవడంతో హమ్మయ్య బ్రతికిపోయాం అంటూ రిలీఫ్ పొందుతున్నారు.