That's the reason for cheetah movements in Tirumala says PCF Nageswara Rao: తిరుమల నడక దారిలో చిరుతలను పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు పీసీఎఫ్ నాగేశ్వర రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల నడక దారిలో 300 ట్రాప్ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అలాగే 100 మంది సిబ్బంది క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నామని తెలిపారు. జులై నుంచి సెప్టెంబర్ వరకు జంతువులు సంపర్కం సమయమని.. అందుకే చిరుతల కదలికలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. మోకాళ్ళ మెట్టు, నరసింహ స్వామి ఆలయం వద్ద ట్రంక్ లైజింగ్ ఎక్వింప్ మెంట్ సిద్ధంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
80 చోట్ల శ్రీవారి మెట్టు ప్రాంతంలో ఫారెస్ట్ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మెట్ల మార్గంలో వంద మంది గ్రూప్ లుగా వెళ్లాలని, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని చెప్పారు. చిరుత, ఎలుగు బంటి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయని చెప్పారు. నడక మార్గంలో భక్తుల సంఖ్య చాలావరకు తగ్గిందని పేర్కొన్నారు. లక్షితను చంపినది చిరుతనే అని.. పట్టుకున్న రెండు చిరుతల్లో ఏది అని తెలాలంటే రిపోర్ట్ రావాల్సి ఉందని అన్నారు.
ప్రస్తుతం ఒక చిరుత, ఎలుగు బంటి మాత్రమే ఉన్నాయన్నారు. వైల్డ్ లైఫ్ ఇండియా వారి గైడ్ లైన్స్ ప్రకారం కంచే ఏర్పాటుపై నిర్ణయం ఉంటుందన్నారు. మహారాష్ట్ర నుంచి కొన్ని బోనులు తీసుకువచ్చామని.. వాటిని కొన్ని రీమోడల్ చేస్తున్నామని అన్నారు. కంఫా ఫండ్స్‌తో అటవీ సమీప ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని నాగేశ్వరరావు వెల్లడించారు.
కాగా తిరుమల కాలిబాటలో క్రూర మృగాల జాడలను టీటీడీ, రాష్ట్ర అటవీ శాఖ అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చిరుత కోసం నరసింహ ఆలయం సమీప ప్రాంతంలో అటవీ శాఖ పది బోనులను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా తెప్పించిన బోనుల ద్వారా చిరుతలను పట్టేందుకు వాడనున్నారు. ఆగష్టు 21వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో నరసింహ ఆలయ అటవీలో చిరుతలు, ఎలుగు బంటులు సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.
కెమెరాల్లో రికార్డు అయిన ఫొటోలను అటవీ శాఖ అధికారులు విడుదల చేశారు. ఇవాళ మరోసారి సాయంత్రం నరసింహ ఆలయం వద్ద ఎలుగు బంటి సంచరించింది. దీంతో అక్కడ ఎలుగు బంటిని చూసిన భక్తులు భయాందోళనలకు గురయ్యారు. కాలిబాటలో వచ్చే భక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని కొందరు మాపై సామాజిక మాధ్యమాల్లో అనవసరమైన వదంతులు సృష్టిస్తున్నారని.. ఇలాంటివి భక్తులు నమ్మరాదని టీటీడీ అటవీ శాఖ అధికారులు తెలిపారు.