జమ్మూ కాశ్మీర్‌లోని (Jammu and Kashmir)పూంచ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మంగళవారం నలుగురు ఉగ్రవాదులను (Terrorists) భద్రతా బలగాలు హతమార్చాయి . సోమవారం రాత్రి సురన్‌కోట్‌లోని సింధారా టాప్ ప్రాంతంలో సైన్యం, జమ్మూ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 5 గంటలకు ఎన్‌కౌంటర్ తిరిగి ప్రారంభమైందని, ఇందులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ముఖేష్ సింగ్ తెలిపారు.
వైట్ నైట్ కార్ప్స్ ట్వీట్ చేస్తూ, "ఆపరేషన్ త్రినేత్ర-2 (Operation Trinetra-2). ఇంటెలిజెన్స్ ఆధారంగా సీజ్ చేసి పెద్దఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పూంచ్(Poonch) జిల్లాలోని సురన్‌కోట్ (Surankot ) తహసీల్‌లోని సింధారా, మైదాన గ్రామాల సమీపంలో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు.
అటు జమ్మూకశ్మీర్‌లో టార్గెట్ హత్యలు మరోసారి ఊపందుకున్నాయి. లోయలో కాశ్మీరేతర కార్మికులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ( Anantnag region) ఉగ్రవాదులు ఇద్దరు కూలీలపై కాల్పులు జరపగా, తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి నిలకడగా ఉంది. వారిద్దరూ మహారాష్ట్ర (Maharashtra)వాసులుగా గుర్తించారు. నగల దుకాణంలో పనిచేస్తున్నాట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో, సంఘటన తర్వాత, ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఆ ప్రాంతాన్ని సీజ్ చేస్తూ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు పోలీసులు.
ఈ ఏడాది కాశ్మీర్‌లో స్థానికేతరులు, మైనారిటీలపై జరిగిన నాల్గవ దాడి ఇది. గత ఐదు రోజుల్లో ఇది రెండవ దాడి. ఈ ఏడాది మొదట ఫిబ్రవరి 26న, దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అచెన్ వద్ద బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కాశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. మూడు నెలల తర్వాత, మే 29న అమ్యూజ్‌మెంట్ పార్క్‌లోని ప్రైవేట్ సర్కస్ ఫెయిర్‌లో పనిచేస్తున్నఉదంపూర్ నివాసి దీపును హతమార్చారు. ఆ తర్వాత జూలై 13న షోపియాన్ జిల్లాలోని గగ్రాన్ ప్రాంతంలోని ఇంట్లోకి చొరబడిన ఉగ్రవాదులు బీహార్‌లోని సుపాల్ జిల్లా నివాసితులైన అన్మోల్ కుమార్, పింటూ కుమార్ ఠాకూర్, హీరాలాల్ యాదవ్ అనే ముగ్గురు కూలీలను కాల్చిచంపారు. జులై 18న ఉగ్రవాదులు ఈ పిరికిపంద చర్య చేయడం ఇది వరుసగా నాలుగో ఘటన.