గోదావరిలో భారీగా వచ్చి చేరుతున్న నీరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం తాళిపేరు ప్రాజెక్టుకు ఎగువ రాష్ట్రాలైనటువంటి చత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహాద్దుల నుంచి వస్తున్న వరదనీరు ప్రాజెక్టు లోకి వచ్చి చేరడంతో ప్రాజెక్టు 21 గేట్లను ఎత్తి దిగువకు 47,437 సెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో జలాశయాల నుండి మరింత వరదనీటిని దిగువకు విడుదల చేస్తే... భద్రాచలం వద్ద మరో 5 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని జలవనరుల కేంద్ర అధికారులు తెలియచేస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన అధికారులు
అత్యవసరం అయితే తప్పా.. చేపలు పట్టే జాలరులు, కట్టెల కోసం వెళ్లేవారు వాగులు, వంకలను దాటవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరద ప్రమాదాలు నివారించడానికి ఇప్పటికే జిల్లా కేంద్రం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర సేవల కోసం అధికారులు కంట్రోల్ రూమ్ లు ఏర్పాట్లు చేశామన్నారు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు తెలిపారు. అప్పటిదాకా ఎటువంటి వరద ప్రమాదం ఉండదని తెలిపారు.
ఆయా మండలాలకు రాకపోకలు బంద్
ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో రోజురోజుకి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఎటపాక మండలంలో ప్రధాన రహదారులపైకి వరదనీరు చేరడంతో భద్రాచలంతో పాటు ఇతర మండలాలకు రాకపోకలు ఇప్పటికే నిలిచిపోయాయి. కూనవరం మండలంలో కూనవరం, టేకులబోరు, శబరి కొత్తగూడెం, చినార్కూరు, కొండ్రాజుపేట, పూసుగూడెం, ముల్లూరు, తాళ్లగూడెం గ్రామాల్లోకి నీరు చేరింది. వీఆర్‌పురం మండలంలో పలు గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. గోదావరి ఎగపోటు కారణంగా శబరినది కూడా క్రమేపీ పెరుగుతోంది. చింతూరు వంతెన వద్ద శబరినది వరదనీరు గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. చింతూరులోని శబరిఒడ్డు, సంతపాకలు, టోల్‌గేట్, లారీ ఆఫీస్, పంచాయతీ రహదారి, వీఆర్‌పురం రహదారి ప్రాంతాలతో పాటు ఏజీ కొడేరులో ఇళ్లల్లోకి వరదనీరు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం పెరుగుతోంది. లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళుతోంది.