ఇటీవల మూవీ ఇండస్ట్రీలో వివాదాలు రావడం, పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం, కేసులు నమోదు అవ్వడం కామన్ అయిపోయింది. సీనియర్ నటుడు వీకే నరేష్ తనకు పర్సనల్ గన్ లైసెన్స్ కావాలని పోలీసులను కోరాడు. దివంగత రాకేష్ మాస్టర్ భార్యపై యూట్యూబ్ ఛానల్ మహిళలు దాడి చెయ్యగా పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం జరిగింది. తాజాగా నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌లపై ఆస్థి అపహరణ కేసు నమోదు అయ్యింది. ఆరేళ్ళ క్రితం ప్రేమలో పడి, సహజీవనం చేస్తూ గత రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న సంచలన జంట నయనతార, విఘ్నేష్ శివన్. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో నయనతార నటిగా రాణిస్తూ.. సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉన్నా, వ్యక్తిగత జీవితంలో మాత్రం పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ జంట సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులవడం వివాదంగా మారండం.. కేసు పరిశీలించాక కోర్టు వీరికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది.
కాగా, తాజాగా.. నయనతార జంటకు మరో సమస్య వచ్చి పడింది. విఘ్నేష్ శివన్ పూర్వీకులది తమిళనాడులోని తిరుచ్చి జిల్లా, లాల్ కుడి గ్రామం. ఈయన తండ్రి పేరు శివకొళుదు. వీళ్లు తొమ్మిది మంది అన్నదమ్ములు. పోలీస్ ఇన్పార్మర్‌గా పని చేసిన విఘ్నేష్ శివన్ తండ్రి శివకొళుదు ఇప్పుడు లేరు. అయితే ఈయన బ్రతికున్నప్పుడు తమ ఉమ్మడి ఆస్థిని అన్నదమ్ములకు తెలియకుండా మోసపూరితంగా అపహరించినట్లు ఆయన సోదరుడు మాణిక్యం కోయంబత్తూర్‌లో నివసిస్తున్న మరో సోదరుడు కుంచిత పాదం గురువారం తిరుచ్చి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
‘తమ సోదరుడు, విఘ్నేష్ శివన్ తండ్రి శివకొళుదు ఉమ్మడి ఆస్థిని తమకు తెలియకుండా వేరే వారికి విక్రయించి మోసానికి పాల్పడ్డాడని, తమ ఆస్థిని కొనుగోలు చేసిన వారికి తిరిగి డబ్బు ఇచ్చి ఉమ్మడి ఆస్థిని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా తమ సోదరుని కుమారుడు అయిన విఘ్నేష్ శివన్, అతని తల్లి మీనా కుమారి, భార్య నయనతారలపై చర్యలు తీసుకోవాలని’ మాణిక్యం ఫిర్యాదులో కోరుకున్నారు. దీంతో తిరుచ్చి డీఎస్పీ ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడీ సంఘటన చిత్ర పరిశ్రమలో, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. సరోగసి వివాదం నుండి బయటకు వచ్చిన నయనతార, మళ్లీ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది.