భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సుప్రీంకోర్టులో కీలక మార్పులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టులోని ఐదు కోర్టు గదుల్లో ఉచిత వైఫైని అందుబాటులోకి తీసుకొచ్చాం. బార్ రూమ్‌ల్లోనూ ఈ సదుపాయం ఉంది. త్వరలోనే అన్ని కోర్టు గదులకు ఈ సేవలను విస్తరిస్తాం. డిజిటైజేషన్ దిశగా ఇదో కీలక ముందడుగు. ఇకపై న్యాయ పుస్తకాలు, పేపర్లు కన్పించవు. అయితే, దానర్థం.. మేం పుస్తకాలు, పేపర్లపై ఆధారపడబోమని కాదు’అని తెలిపారు.
సుప్రీంకోర్టులో ఇ-ఇనిషియేటివ్ కార్యక్రమంలో భాగంగా ఈ ఉచిత వైఫై సేవలను ఏర్పాటు చేశారు. కోర్టుకు వచ్చే లాయర్లు, వ్యాజ్యదారులు, మీడియా వ్యక్తులు, ఇతరులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని న్యాయస్థానం వెల్లడించింది. ప్రస్తుతానికి సీజేఐ కోర్టుతో పాటు 2, 3, 4, 5 కోర్టు గదుల్లో ఈ వైఫై సేవలు ఉన్నాయి. దీంతో పాటు కారిడార్, ప్లాజా, వెయిటింగ్ ఏరియా, క్యాంటీన్, ప్రెస్ లాన్ -1, 2 ప్రాంతాల్లో ఈ ఉచిత సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కోర్టు తమ ప్రకటనలో వెల్లడించింది.
ఆరు వారాల వేసవి సెలవులను ముగించుకుని సుప్రీంకోర్టు సోమవారమే పునఃప్రారంభమైంది. నేటి నుంచి పలు కీలక కేసులను సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది. యూపీలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అష్రఫ్‌లను పోలీసుల సమక్షంలోనే హతమార్చడంపై విచారణకు కమిషన్‌ను నియమించాలని కోరుతూ దాఖలైన పిటిషన్, మణిపుర్ అల్లర్లు వంటి కేసులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. పురుషుల హక్కుల పరిరక్షణకు జాతీయ కమిషన్ ఏర్పాటు, స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత, ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మొదలయ్యాక అర్హత నిబంధనలను మార్చడానికి ప్రభుత్వాలకు ఉన్న అవకాశం, ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటు, 370 అధికరణం రద్దు, బిల్కిస్ బానో కేసులో 11 మంది ముద్దాయిలకు విముక్తి కల్పించడం తగదన్న పిటిషన్ వంటివన్నీ విచారణకు రానున్నాయి.