/rtv/media/media_files/2026/02/13/chityala-2026-02-13-11-23-29.jpg)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ చరిత్ర సృష్టించింది. సమాజంలో వివక్షను ఎదుర్కొనే ట్రాన్స్‌జెండర్ వర్గం నుంచి ఓ వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు నుండి నాగిళ్ల సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, సుధాకర్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో సుధాకర్ తన సమీప ప్రత్యర్థిపై 102 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు.
సాధారణంగా ట్రాన్స్‌జెండర్లను కేవలం శుభకార్యాలకే పరిమితం చేసే ప్రస్తుత రోజుల్లో చిట్యాల ఓటర్లు మార్పుకు నాంది పలికారు. నాయకత్వ లక్షణాలు ఉంటే లింగంతో సంబంధం లేకుండా ఆదరిస్తామని ఇక్కడి ప్రజలు నిరూపించారు. నాగిళ్ల సుధాకర్ విజయం కేవలం ఆ వ్యక్తికి మాత్రమే కాకుండా, మొత్తం ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఈ విజయం పట్ల స్థానికులు, ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదవి చేపట్టిన తర్వాత తన వార్డు అభివృద్ధి కోసం, మైనారిటీ వర్గాల హక్కుల కోసం కృషి చేస్తానని సుధాకర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
Follow Us