మహబూబాబాద్ లో బీఆర్ఎస్ తలపెట్టిన గిరిజన మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 25న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా చేసుకోవచ్చని సూచించింది. వెయ్యి మంది రైతులతో ధర్నాకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. ముందుగా ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు అనుమతి కోసం కోర్టును ఆశ్రయించారు. గత 24 గంటల నుంచి మహబూబాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లగచర్లలో గిరిజనులపై దాడికి నిరసనగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మహాధర్నా చేపడతామని ప్రకటించింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు
ధర్నా నిర్వహించి తీరుతామంటూ..
ఎస్పీ క్యాంపు కార్యాలయంపైకి బీఆర్ఎస్ కార్యకర్తలు వాటర్ బాటిళ్లు విసిరారు. అంతటితో ఆగకుండా అడిషనల్ ఎస్పీ చెన్నయ్యతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. అనుమతి లేకున్నా నేడు ధర్నా నిర్వహించి తీరుతామంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు తేల్చి చెప్పడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఈ ధర్నాలో కేటీఆర్ పాల్గొననుండగా ఆందోళన నేపథ్యంలో పర్యటటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించినట్టు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోన్న టెన్షన్ స్థానికుల్లో వ్యక్తం అవుతోంది.