HYDRA: హైదరాబాద్ లో చెరువులు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేందుకు రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన హైడ్రాకు మరిన్ని పవర్స్ దక్కనున్నాయి. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. తాజాగా హైడ్రా చట్టబద్ధత విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ పై ఈరోజు గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. హైడ్రాకు చట్టబద్ధతో మరిన్ని పవర్స్ రానున్నాయి. ఇకపై మరింత దూకుడుగా హైడ్రా వ్యవహరించనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రాకు చట్టబద్ధతపై బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
హైడ్రా విస్తరణ..
హైదరాబాద్ వరకు పరిమితం అయిన హైడ్రాను ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) వరకు విస్తరించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మూడు జోన్లుగా విభజించి, వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కాగా సెంట్రల్ జోన్‌గా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్, నార్త్ జోన్‌గా సైబరాబాద్, సౌత్ జోన్‌గా రాచకొండను విభజించేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటికి జోనల్ అధికారులు, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. ఈ మూడు జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రెండు నెలల కిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. కాగా దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం.