Musi River Victims: తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా సంచలనంగా మారింది. కేవలం పేద వారి ఇళ్లను టార్గెట్ చేస్తూ బడాబాబుల ఇళ్ల కూల్చివేతలను వదిలేస్తున్నారని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది సుందరీకరణ కార్యక్రమానికి అడ్డంకులు తగులుతున్నాయి. మూసీ నది నిర్వాసితులు పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు ఎలాగైనా మూసీ నది సుందరీకరణ చేసి తీరుతామని రాష్ట్ర ప్రభుత్వం పట్టు బట్టుకుంది. అయితే.. తాజాగా మూసీ నిర్వాసితులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు రూ.25,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటన విడుదల చేశారు.
5 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు..
మూసీ నిర్వాసితులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చి పునరావాసం కల్పిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో 15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మూసీ రివడ్ బెడ్, బఫర్ జోన్‌లలో నివసిస్తున్న కుటుంబాల పునరావాసానికి రాష్ట్ర సర్కార్ కేటాయించింది. రివర్ బెడ్‌లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణ కోసం సంబంధిత జిల్లా కలెక్టర్లు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. నిర్వాసితులకు డబులు బెడ్ రూం ఇళ్లు కేటాయించి పునరావాసం కల్పించిన తర్వాతే ఈ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభిస్తామని పేర్కొంది.