Rythu Bharosa: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తున్నా నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అందరు అనుకున్నారు. ఇదే కాకుండా కాంగ్రెస్ నాయకులు కూడా ఒక సంవత్సరం లోపే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు అమలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మొదటగా భావించింది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను ఎంపిక చేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలను ఏర్పాటు చేసి దాదాపు 4 నెలలు గడుస్తున్న వివిధ కారణాలతో ఇంకా కార్యాచరణను ప్రారంభం కాలేదు. అదే సమయంలో కులగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. కులగణన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఈ నెల 30న కులగణన కార్యక్రమం ముగియనుంది. అయితే డిసెంబర్ మూడో వారంలో లేదా వచ్చే ఏడాది జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు ప్రారంభించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
డిసెంబర్ 9 తర్వాతనే రైతు భరోసా?
ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే ఏడాదికి రైతు భరోసా కింద ఎకరాకు రూ.15000 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక సారి మాత్రమే రైతు బంధు నిధులను విడుదల చేసింది. రైతు భరోసాను ఇంకా ప్రారంభించలేదు. అయితే.. డిసెంబర్ 9కి ముందే ఆ పథకాన్ని ప్రారంభిస్తుందన్న ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. అయితే.. డిసెంబర్ 9 తర్వాతనే ఆ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది.