/rtv/media/media_files/2026/01/22/fotojet-2026-01-22t094136-2026-01-22-10-05-42.jpg)
Jubilee Hills Peddamma Thalli Temple
Jubilee Hills Peddamma Thalli : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో శ్రీ పెద్దమ్మ వారి దేవాలయం గురించి తెలియని వారు ఉండరు. వేల సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ఈ దేవాలయం ఉన్నట్లు చెబుతున్నా ఈ మధ్య కాలంలో అయితే ఈ గుడికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ గుడి స్థల పురాణానికి వస్తే ఒకప్పుడు మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్ని పీడిస్తూ యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ ఉండేవాడు. రుషి పత్నులను చెరబడుతూ ఇంద్రాదులను తరిమి కొడుతూ ఉండేవాడు. త్రిమూర్తులు కూడా అతని ధాటికి తట్టుకోలేకపోయి శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/22/untitled_2254_01dffe12e5-2026-01-22-10-09-17.jpg)
మహిషుడు సామాన్యుడు కాడు నిజానికి మహా బలవంతుడు. అందులో, వరగర్వంతో విర్రవీగుతున్నా మహిషుడి శక్తి మహాశక్తి అయిన అమ్మవారి ముందు చిన్నబోయింది. అలా అమ్మవారు ఆ రాక్షసుడిని అంతమొందించారు. అయితే ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించి అప్పట్లో అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్దిరోజులు సేద తీరింది. అదే జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం పెద్దమ్మ దేవస్థానమున్న ప్రాంతమని అక్కడి వారికి నమ్మిక. నిజానికి పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు, ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే కడు పెద్దమ్మ అని ఆమెకు ఆ పేరు పెట్టుకున్నట్టు చెబుతూ ఉంటారు, సుమారు 2000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గుడి చరిత్రలోకి వెళితే...
ఆలయ చరిత్ర
పౌరాణిక చరిత్ర ఆధారంగా ప్రజలను పీడిస్తున్న రాక్షసులను సంహరించేందుకు వచ్చిన శక్తి స్వరూపిణి పెద్దమ్మతల్లి జూబ్లీహిల్స్‌లోని (గతంలో కొండలు గుట్టలు ఉన్న) బావివద్ద సేద తీరేందుకు వచ్చి అక్కడే కొలువు ఉన్నట్లు పండితులు పేర్కొంటున్నారు. అప్పుడే ఆమె చిన్న విగ్రహం ఇక్కడ కొలువుదీరినట్టు చరిత్ర చెబుతుంది. ఇక్కడ విగ్రహం ఉండటం గమనించిన కొందరు గిరిజనులు చిన్నగా గుడిసె వేసి పూజలు చేయడం ప్రారంభించారు. అనంతరం అది చిన్న ఆలయంగా మారింది. ఆలయం చుట్టుపక్కల కొండలు, గుట్టలతో పాటు చెట్లు విపరీతంగా ఉండటంతో ఇది చిట్టడివిగా కనిపించడంతో చాలా మంది అటు వైపు వెళ్లేందుకు భయపడే వారు. ఆదివారం, మంగళవారం మాత్రం కొంతమంది ఉదయమే వచ్చి ఇక్కడ వనభోజనాలు చేసేవారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకునే వారు. తరువాత భక్తుల సంఖ్య పెరగడంతో 1994లో హంపి శంకరాచార్యుల ఆధ్వర్యంలో బిజ్జుమల్ల సిద్ధాంతి సహకారంతో అప్పటి ఎమ్మెల్యే పీజేఆర్ ఆలయాన్ని పునర్నిర్మించారు.
పీజేఆర్ కృషితో..
కొలిచే వారికి కొంగు బంగారమై వరాలిచ్చే తల్లి జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ 33వ వార్షికోత్సవ వేడుకలు రేపటినుంచి ప్రారంభంకానున్నాయి. అలాగే.. ఈనెల 26న పెద్దమ్మవారి ఉత్సవమూర్తికి పుష్కరిణి యందు అవభృత స్నానంతో వార్షికోత్సవాలు ముగుస్తాయి.. ముఖ్యంగా పెళ్లి కాని వారు, సంతాన లేమి, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయం దినాదినాభివృద్ధి చెందుతోంది. మాజీ సీఎల్‌పీ నేత దివంగత పి.జనార్దన్‌రెడ్డి కృషితో చిన్నగా ఉన్న ఆలయం ఇప్పుడు అతి పెద్ద ఆలయంగా అవతరించింది. ఇప్పుడు 33వ వార్షికోత్సవ వేడుకల కోసం ముస్తాబైంది.
పీజేఆర్ ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఇక్కడి నుంచే ప్రారంభించడం అనవాయితీగా పెట్టుకునే వారు. జూబ్లీహిల్స్‌తోపాటు మాదాపూర్ ధనవంతుల కాలనీగా మారడంతో జన సంచారం కూడా పెరిగింది. క్రమంగా అమ్మవారి ఆలయాన్ని కూడా విస్తరించారు. ఆలయంలోని కట్టడాలు చూపరులను కనువిందు చేస్తాయి. ప్రారంభంలో ఆర్చీ మొదలుకొని అన్నిచోట్లా దేవతామూర్తులు ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తారు. ఆలయ ప్రధాన గోపురంపై శిల్పకళ ఉట్టిపడుతోంది. ప్రధాన ఆలయం ముందు మధురై నుంచి ప్రత్యేకంగా తెప్పించిన దీపాంతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రధాన మండపంలో చెక్కిన దేవతామూర్తులకు అందమైన రంగులు వేయడంతో విశేషంగా ఆకట్టుకుంటోంది.
రథోత్సవం
పెద్దమ్మ తల్లి ఆలయంలో నిత్య పూజలతోపాటు విశేష పూజలు నిత్యం జరుగుతుంటాయి. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజు అమ్మవారి రథోత్సవ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పెద్దమ్మ తల్లి విగ్రహం రథోసప్తమి రోజున ప్రతిష్ఠాపన జరిగింది. ఈ తరుణంగా ప్రతి యేటా అమ్మవారి ఉత్పవ విగ్రహాన్ని రథంపై ఉంచి పలు వీధుల్లో ఊరేగిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడతారు. ఈనెల 25న రథోత్సవం జరపనున్నారు. ఈనెల 26న పెద్దమ్మవారి ఉత్సవమూర్తికి పుష్కరిణి యందు అవభృత స్నానంతో వార్షికోత్సవాలు ముగుస్తాయి.
వార్షికోత్సవ పూజలు
ఈనెల 23న ఉదయం 3 గంటలకు పెద్దమ్మతల్లి అభిషేకం, మంత్రపుష్పము, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, అఖండదీపారాధన, వేద పారాయణము, నవగ్రహజపములు, రుద్రాభిషేకం, సాయంత్రం అమ్మవారి ఉత్పవమూర్తి పల్లకి సేవ నిర్వహిస్తారు. ఈనెల 24న మండపపూజలు, వేదపారాయణము, అరుణ, పంచోపనిషత్, దేవీభాగవత, మహావిద్యా, చండీపారాయణాదులు, సామూహిక లలితాసహస్రనామ కుంకుమార్చనలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.
Follow Us