Old City Metro Rail : కూల్చివేతలకు మేం రెడీ అంటున్న ఓల్డ్‌ సిటీ జనం...ఎందుకంటే..

కూల్చివేతలు అనగానే జనం బెంబేలెత్తిపోతారు. అధికారులను అడ్డకొని ఆందోళనలు చేస్తారు. ఏడుపులు, గొడవలు సర్వసాధారణం. కానీ ఓల్డ్ సిటీ వాసులు మాత్రం తమ ఇండ్లను కూల్చివేయమంటూ అధికారులకు స్వాగతం పలుకుతున్నారు. చాలామంది స్వచ్ఛందంగా తామే కూల్చివేతలు చేపడుతున్నారు.

New Update
Old City Metro Rail

Old City Metro Rail

Old City Metro Rail : కూల్చివేతలు అనగానే జనం బెంబేలెత్తిపోతారు. అధికారులను అడ్డకొని ఆందోళనలు చేస్తారు. ఏడుపులు, గొడవలు సర్వసాధారణం. కానీ వారు మాత్రం తమ ఇండ్లను కూల్చివేయమంటూ అధికారులకు స్వాగతం పలుకుతున్నారు. చాలామంది స్వచ్ఛందంగా తామే కూల్చివేతలు చేపడుతున్నారు. మీరు మార్కుపెట్టండి చాలు మేమే కూల్చివేస్తమంటూ ముందుకు వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం తమకు మెట్రో అందుబాటులోకి వస్తుందన్న సంబురం. అవును పాతనగరంలోని జనం మెట్రో విస్తరణ కోసం స్వచ్ఛందంగా కూల్చివేతలు చేపడుతున్నారు. దీంతో పాత నగర వాసల చిరకాల కల నెరవేరబోతుంది.

హైదరాబాద్‌ అంటేనే ఓల్డ్‌సిటీ. కానీ ఆ పాత నగరం పాత నగరంగానే ఉండిపోయింది. ప్రభుత్వాలు మారినప్పటికీ అక్కడ అభివృద్ధి అంతంతా మాత్రమే. అభివృద్ధికి ఆమడ దూరంగా ఇరుకిరుకు సందులతో కూడుకున్న పాతనగరానికి మహర్ధశ పట్టపోతుంది. సరైన రవాణా సౌకర్యాలు లేక నేటికి రిక్షాలు, ఆటోలను ఆశ్రయించాల్సిన అవసరం ఇక మీదట ఉండదని ఓల్డ్‌సిటీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. నగర వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన మెట్రో త్వరలో పాత నగరంలోనూ పరుగులు పెట్టబోతుంది. ఎంతో కాలంగా ఎదురు చూసిన పాత నగరవాసులు మెట్రోలో ప్రయాణించే అవకాశం మరెంతో దూరంలో లేదు. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు.
 
గతంలో మెట్రో విస్తరణ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ తమ షాపులు, ఇండ్లు పోతాయని చాలామంది విస్తరణ పనులను అడ్డుకున్నారు. అయితే అధికారులు అక్కడివారితో ప్రత్యేకంగా సమావేశమై నిర్మాణాలకు పాక్షికంగా మాత్రమే నష్టం జరిగేలా మెట్రోను విస్తరించేందుకు ప్రణాళికను రూపొందించడంతో వారి నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో  ఇప్పటికే పలుమార్లు మెట్రో అధికారులు పాత నగరంలో సర్వేలు చేపట్టి, భూసార పరీక్షలను సైతం పూర్తి చేశారు. పాత నగరంలో ఎంజీబీఎస్‌ నుంచి మొదలయ్యే మెట్రో చాంద్రాయణగుట్ట వరకు కొనసాగనుంది.
  
ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు కొనసాగే మెట్రో 7.5 కిలోమీటర్ల దూరం కొనసాగనుంది. ఈ మార్గంలో ఇప్పటి వరకు 1100 నిర్మాణాలను పాక్షికంగాను, కొన్ని పూర్తిగాను తొలగించే అవకాశం ఉందని అధికారులు నిర్ధారించారు. వారిలో చాలామంది తమ ఆస్తులను మెట్రోకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇందులో ఇప్పటికే 270 మంది స్వచ్ఛందంగా తమ ఆస్తులను మెట్రో నిర్మాణ సంస్థలకు అప్పగించారు. వారికి జిల్లా అధికార యంత్రాంగం గజానికి రూ.81 వేల నష్ట పరిహారాన్ని అందించేందుకు సిద్ధమైంది.ఇప్పటికే వీరిలో 170 మందికి  రూ.80 కోట్ల చెక్కులను అందించిన అధికారులు వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన రోడ్డుకు సమీపంలో కొనసాగుతున్న కూల్చివేత పనులను అధికారులు వేగవంతం చేస్తున్నారు. మరో 3 నెలల నుంచి 4 నెలల కాలంలో మెట్రో రైల్‌ నిర్మాణం కోసం గుర్తించిన ఆస్తులను స్వాధీనం చేసుకుని పనులను మరింత వేగవంతం చేస్తామని మెట్రో రైల్‌ అధికారులు తెలిపారు.

అన్ని పనులు అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మార్చి నాటికి మెట్రో విస్తరణ పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. పాత నగరంలో మెట్రో పరుగులు పెడితే అక్కడి వారి జీవన విధానంలోనూ మార్పు వస్తుందని, అభివృద్ధికి కొత్త బాటలు పడుతాయని పలువురు భావిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు