ఎట్టకేలకు లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆయన పోలీసుల ముందు లొంగిపోవడంతో అరెస్ట్ చేశారు. కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు సురేష్ ను హాజరుపరిచారు. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో సురేష్ A2గా ఉన్నాడు. కలెక్టర్ పై దాడికి గ్రామస్తులను రెచ్చగొట్టడంతో పాటు.. అధికారులను కావాలనే గ్రామంలోకి తీసుకెళ్లాడన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఘటన జరిగిన నాటి నుంచి ఆయన పరారీలో ఉన్నాడు.
ప్లాన్ ప్రకారమే గ్రామంలోకి రావాలని కలెక్టర్ కు వినతి..
ఈ నెల 11న లగచర్ల సమీపంలో ఫార్మా సిటీ భూసేకరణకు సంబంధించి అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కలెక్టర్ తో పాటు పలువురు కీలక అధికారులు హాజరయ్యారు. అయితే.. గ్రామంలోకి వచ్చి మాట్లాడాలని కుట్ర ప్రకారమే ప్రధాన నిందితుడు సురేష్ కలెక్టర్ ను గ్రామంలోకి తీసుకెళ్లాడన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న కొందరు కలెక్టర్, అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
వారం ముందు నుంచే గ్రామంలో మీటింగ్స్..
సురేష్ ఘటన జరగడానికి వారం రోజుల ముందు నుంచే గ్రామస్తులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ రెచ్చగొట్టినట్లు సైతం పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మరో ప్రధాన నిందితుడిగా చేర్చిన పోలీసులు ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేశారు. ఘటనకు ముందు సురేష్ తో అనేక సార్లు ఆయన ఫోన్ మాట్లాడినట్లు గుర్తించారు. కలెక్టర్ పై దాడికి కుట్ర చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.