KTR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్ కు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మద్దతుదారులు, హుజూరాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి దాడులకు పాల్పడటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలో బీర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇదే అంశంపై తాజాగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనని, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు , రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అధికార పక్షం చేస్తోన్న దాడులపై తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? ఎటు పోతోంది మన రాష్ట్రం? ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోందని కేటీఆర్ అన్నారు. కౌశిక్ ని గృహ నిర్భంధంలో ఉంచి గాంధీ గూండాలతో దాడి చేయించడం ఏంటని అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకపోవటమేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్నందునే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. కౌశిక్ రెడ్డి ఏమి తప్పు మాట్లాడలేదని కేటీఆర్ అన్నారు. పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో రేవంత్ ఏమన్నారో మర్చిపోయినట్లున్నారు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపమన్నారు. పదవి పోతుందని ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొత్త రాగం మొదలు పెట్టారు.
ఎమ్మెల్యే ఇంటిపై దాడి పదేళ్లలో ఎప్పుడు లేదు. చేతగాని సీఎం ఉండటం వల్లనే ఈ దౌర్భాగ్యం, హైదరాబాద్ లో శాంతిభద్రతలను కంట్రోల్ చేయలేకపోయారని రేవంత్ పాలనపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్ దగ్గర అనర్హత పిటీషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. అసలు అరెకపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని కేటీఆర్ అన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే.. దాడికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందేనని కేటీఆర్ అన్నారు.