మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డీజే టిల్లూ పాటకు దుమ్మలేపారు. డ్యాన్స్ చేసి సందడి చేశారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంస్థ “రన్ ఫర్ గ్రేస్ – స్ర్కీన్ ఫర్ లైఫ్” అనే నినాదంతో గచ్చిబౌలి స్టేడియంలో ఈ రోజు ఉదయం నిర్వహించిన గ్లోబల్ క్యాన్సర్ రన్ 2024ను కోమటిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేన్సర్ వ్యాధి వయసు, లింగ బేధం లేకుండా లక్షలాది మంది జీవితాలను కబలించివేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డులను అందించడమే కాకుండా.. క్యాన్సర్ వ్యాధి కట్టడికి అనేక చర్యలు చేపట్టిందన్నారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే తగ్గించుకోవచ్చని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారన్నారు. కానీ, ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరి ప్రాణాలను హరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌లు చేస్తూ ప్రజలను క్యాన్సర్ బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు నిరుపేదల చికిత్సకు సహాయం అందించడం అభినందనీయమన్నారు. క్యాన్సర్ ను కట్టడి చేసేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అనంతరం డీజే టిల్లూ పాటకు డ్యాన్స్ చేసి రన్ కు హాజరైన యుత్ లో ఉత్సాహం నింపారు. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే కోమటిరెడ్డి సరదగా స్టెప్పులేయడంతో అంతా ఆసక్తిగా గమనించారు. ముందస్తు పరీక్షలతోనే క్యాన్సర్ ను కట్టడి చేద్దామని పిలుపునిచ్చారు.