TS: జైలు మింగేసిన ఆదర్శ జీవితం–ప్రొఫెసర్ సాయిబాబా మాజీ ప్రొఫెసర్, ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త జీ.ఎన్ సాయిబాబా కన్నుమూశారు.నడవటానికి కాళ్ళు లేవు కానీ పదితరాలను నడిపించగల ధైర్యం,ఉద్యమ స్ఫూర్తి ఉంది సాయిబాబాకి. చేయని నేరానికి 9 ఏళ్ళు జైలు శిక్షనుభవించిన ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం. By Manogna alamuru 13 Oct 2024 | నవీకరించబడింది పై 13 Oct 2024 04:55 IST in హైదరాబాద్ నేషనల్ New Update షేర్ చేయండి Professor Sai Baba: మావోయిస్టులతో సంబధాలున్నాయంటూ పదేళ్ల క్రితం వరుసపెట్టి చాలా మంది అరెస్ట్ చేయించింది ప్రభుత్వం. ఫోన్ కాల్ మాట్లాడారు, పుస్తకాలు ఉన్నాయి లాంటి రీజన్స్ తో కూడా నిర్దాక్ష్యణ్యంగా జైల్లో వేశారు. అలా అరెస్ట్ అయిన వారిలో తెలుగు వారిలో విరసం నేత వరవరరావు ఒకరైతే..ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జీ. ఎన్ సాయిబాబా ఒకరు. ఎవరీ సాయిబాబా.. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో సాయిబాబా ఇంగ్లిష్ ప్రొఫెసర్. స్వతహాగా తెలుగు వారు. గోకరకొండ నాగ సాయిబాబా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అమలాపురంలో పేద రైతు కుటుంబంలో జన్మించారు. అమలాపురంలో గ్రాడ్యుయేషన్ చేసున్న కాలంలోనే ఈయన వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యారు. తరువాత ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్ (ఏఐఆర్‌పీఎఫ్) లో చేరారు. 1992లో హైదరాబాదు విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు ఆ ఫోరమ్ ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యదర్శి అయ్యారు. ఆ తరువాత 1995లో ఆ సంస్థకు ఇండియా ప్రధాన కార్యదర్శి గా కూడా పనిచేశారు. దీని తరువాత ఆర్‌డీఎఫ్ అనే సంస్థలో పని చేశారు సాయిబాబా. తెలంగాణలోని ప్రజా ఉద్యమాలే తనకు చదువును, చైతన్యాన్ని నేర్పాయని, తనను వ్యక్తిగా తీర్చిదిద్దింది తెలంగాణే అని సాయిబాబా చెబుతారు. ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే సాయిబాబాకు 90 శాతం వైకల్యముంది. ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితయ్యారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ… 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2017లో గడ్జిరౌలీ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. 2014 నుంచి ప్రొఫెసర్ సాయిబాబా నాగ్‌పూర్ జైల్లోనే ఉన్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని.. ఫ్రొఫెసర్ సాయిబాబాతో పాటు ఐదుగురిపై UAPA కేసులు పెట్టింది. ప్రొఫెసర్ సాయిబాబా, ప్రశాంత్ రాహి (జర్న లిస్ట్), హేమ్ మిశ్రా (జెఎన్‌యులో పరిశోధక విద్యార్థి), పాండు నరోత్, మహేశ్ టిర్కిలకు జీవిత శిక్ష వేసింది. వీరితో పాటు విజయ్ టిర్కికి 10 సంవ త్సరాల జైలు శిక్షను విధించింది, భారతదేశంపై యుద్ధం చేయడానికి కుట్ర పన్నారనీ, నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనీ, వీరి పైన మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే 2022 అక్టోబరులో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. నిందితుల విడుదలపై స్టే విధించింది. అనంతరం 2023 ఏప్రిల్‌లో మరోసారి విచారణ జరిపిన బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. నిందితులను విడుదల చేయాలని చెప్పింది. కానీ దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారి అప్పీల్‌పై మళ్లీ మొదట్నుంచీ విచారణ జరపాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. కాగా.. అరెస్టు నేపథ్యంలో 2014లో ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. 2021లో పూర్తిగా విధుల నుంచి తొలగించింది. ఆయన మెదడే ప్రమాదకరం... సుప్రీంకోర్టులో ప్రొఫెసర్ సాయిబాబా మీద ఉన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలివి. సాయిబాబాకు ఆలోచించే మెదడు ఉందని సొలిసిటర్ జనరల్ చెబుతున్నారని, కానీ ఆయన నేరానికి పాల్పడినట్లు చూపే ఆధారాలు ఏమీ లేవని సాయిబాబా తరుఫు న్యాయవాది బసంత్ వాదించారు. దీని మీద కోర్టు ధర్మాసనం స్పందిస్తూ తీవ్రవాద, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి మెదడే ఎక్కువ ప్రమాదకరమైనది. ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన పని లేదు అని జస్టిస్ షా అన్నారు. ఈ మాటను తాను ఈ నిర్దిష్టమైన కేసును దృష్టిలో పెట్టుకుని అనడం లేదని కూడా షా చెప్పారు. దీని కారణంగానే గృహ నిర్భంధానికి కూడా నిరాకరించారు. అయితే ఈ ఏడాది మార్చి5 న బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సరైన ఆధారాలూ లేవంటూ ఆయన్ను విడుదల చేసింది. కమ్యూనిస్టు లేదా నక్సలైట్ సాహిత్యాన్ని ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం, ఏదైనా భావజాలానికి మద్దతుదారుగా ఉండడం యూఏపీఏ చట్టం కిందకు రాదని చెప్పింది. దాంతో ప్రొఫెసర్ సాయిబాబా జైలు నుంచి విడుదల అయ్యారు. పదేళ్లు జైల్లోనే... 57 ఏళ్ళ సాయిబాబా..వీల్ ఛైర్‌లోనే పదేళ్ల పాటూ జైల్లో జీవించారు. ఈ కాలంలో ఆయన చాలా నరకం అనుభవించారు. కరోనా టైమ్‌లో అయితే మరీను. ఎన్ని సార్లు తన ఆరోగ్యం గురించి అప్పీలు చేసుకున్నా కోర్టులు పట్టించుకోలేదు. జైల్లో ఉన్న కాలంలో సాయిబాబా 21 రకాల అనారోగ్య సమస్యలకు బలయ్యారు. వరవరరావు, సాయిబాబా ఆరోగ్యాల గురించి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో సరైన సదుపాయాలు కల్పించడం లేదని..కరోనా వైరస్ పేరుతో చంపడానిక కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అయితే, వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. కేస్లుల్లో తీవ్రత దృష్ట్యా వయసు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వకూడదని న్యాయస్థానాల్లో వాదిస్తూ వచ్చింది. కానీ ఆరోగ్య సమస్యలే ఇప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన ప్రాణాన్ని తీసుకున్నాయి కూడా. సాయిబాబాకు కిందటి నెల 28వ తేదీన గాల్‌బ్లాడర్ ఆపరేషన్ జరిగింది. గాల్‌బ్లాడర్ తొలగించి స్టంట్ వేసిన చోట చీము పట్టింది. తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, హైఫీవర్‌తో బాధపడ్డారు. డాక్టర్లు చీము తొలగించినప్పటికీ ఆయన తీవ్ర నొప్పితో బాధపడ్డారు. తరువాత ఆయన పరిస్థితి మరింత క్షీణించిందని, అంతర్గత రక్తస్రావంతోపాటు పొత్తికడుపులో వాపుతో ఆయన బాధపడ్డారు, బీపీ పడిపోయి...చివరకు హార్ట్ ఎటాక్‌తో మరణించారు. చీకటి రోజులు... జైల్లో తాను చీకటి అనుభవించానని చెప్పారు ప్రొఫెసర్ సాయిబాబా. అక్కడి అధికారులు చిత్రహింసలకు గురయ్యే పరిస్థితిలు కల్పించి తనను మానసికంగా వేధించారని అన్నారు. వీల్‌చైర్ లేకుండా నడవలేని తనను వీల్‌చైర్ తిరగని సెల్‌లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అరెస్టుకు ముందు కొంతమంది అధికారులు తనను కలిసి మేము చెప్పినట్లుగా చేస్తే వదిలేస్తామని, లేకుంటే తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపి బయటకు రాకుండా చేస్తామని హెచ్చరించారని ఆరోపించారు. అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిని ఉంచే అండా సెల్‌లో తనను ఉంచారని, అందులో కనీసం వీల్ చైర్ తిరిగే పరిస్థితి కూడా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కులాన్ని బట్టి పని.. ఈ మధ్యనే సుప్రీంకోర్టు జైళ్ళల్లో కులాన్ని బట్టి పనిని ఇవ్వడం అన్యాయమంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ పద్ధతిని మార్చాలంటూ ఆదేశాలిచ్చింది. ఇదే విషయాన్ని ప్రొఫెసర్ సాయిబాబా కూడా చెప్పారు. సమాజంలో కుల వ్యవస్థ ఎంతలా పాతుకుపోయి ఉందో..జైళ్ళల్లో కూడా అంతలానే ఉందని ఆయన చెప్పారు. ఒక వ్యక్తి కులాన్ని బట్టి జైలు సిబ్బంది ప్రవర్తించే తీరు ఉంటుందని, ఖైదీలకు ఇచ్చే పని విషయంలోనూ కులాన్ని బట్టే ఉంటుందని సాయిబాబా చెప్పారు. ఆ విషయాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. ముఖ్యంగా, డ్రైనేజీ, టాయిలెట్ శుభ్రపరిచే పనులు వారి కులాలను బట్టి సిబ్బంది కేటాయించారని.. అక్కడి జైలు మాన్యువల్‌లోనూ ఇదే రాసి ఉండటం చూసి తాను షాకయ్యానని చెప్పుకొచ్చారు. తన జైలు జీవితం, అనుభవించిన వేదన గురించి వివరించేందుకు తనకు రోజులు చాలవంటూ చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీవితాన్ని కోల్పోయాను.. తాను ఈ పదేళ్లలో చాలా కోల్పోయానని చెప్పుకున్నారు సాయిబాబా. తన స్టూడెంట్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. తరగతులకు దూరమయ్యాను. తానెప్పుడూ టీచర్‌గానే ఉన్నా, దాని ప్రాముఖ్యం నాకు తెలుసు. తాను జైల్లో ఉన్నా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు, వారితో మాట్లాడుతున్నట్లు కలలు వచ్చేవి అన్నారు జైలు నుంచి విడుదల అయిన సాయిబాబా. నిబద్ధత గల టీచర్ ఆయన.ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించటం సాధారణ విషయంగా మారుతోందని సాయిబాబా ఆవేదన వ్యక్తం చేశారు. భీమా కోరేగావ్ కేసులో తాను లేకపోయినా తనపై కేసు పెట్టారని చెప్పారు. జైలుకు వచ్చే రౌడీలు, పెద్ద నేరాలు చేసేవారు కూడా తక్కువ సమయంలో బయటకు వెళ్తారు కానీ..ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వారికి మాత్రం కనీసం బెయిల్ కూడా రాదని కామెంట్ చేశారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి