/rtv/media/media_files/2026/02/13/vardhanapeta-2026-02-13-15-36-51.jpg)
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డు ఫలితం రీకౌంటింగ్‌లో తారుమారు కావడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొదట వెలువడిన ఫలితాలకు, రీకౌంటింగ్ తర్వాత ప్రకటించిన ఫలితాలకు పొంతన లేకపోవడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే అధికారులు ఫలితాలను తారుమారు చేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
స్వల్ప మెజారిటీతో విజయం
ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత 12వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి 7 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించినట్లు తొలుత అధికారులు ప్రకటించారు. అయితే, దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ విజ్ఞప్తి మేరకు అధికారులు తిరిగి ఓట్లను లెక్కించగా, ఫలితం పూర్తిగా తారుమారైంది. రీకౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి 13 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించడం వివాదానికి దారితీసింది.
ఒకే వార్డులో రెండు వేర్వేరు ఫలితాలు ఎలా ప్రకటిస్తారని బీఆర్‌ఎస్ నాయకులు అధికారులను నిలదీశారు. కౌంటింగ్ కేంద్రం లోపల అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, రిటర్నింగ్ అధికారిపై ఒత్తిడి తెచ్చి ఫలితాన్ని మార్పించారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. నిబంధనల ప్రకారం కాకుండా ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది.
Follow Us