హైదరాబాద్ నిమజ్జన వేడుకలు, శోభాయాత్ర అంటేనే అందరికీ హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. ఇక్కడ జరిగే శోభాయాత్రను చూసేందుకు నగరం నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుచి భక్తులు భారీగా తరలివస్తారు. అయితే.. శోభాయాత్ర నేపథ్యంలో రేపు హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. దీంతో సొంత వాహనంలో ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లి నిమజ్జన వేడుకలను చూడడం చాలా కష్టం. ఒకవేళ కష్టపడి వెళ్లినా.. వాహనాలను పార్కింగ్ చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. అయితే.. భక్తుల కోసం TGSRTC, మెట్రో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మైట్రో రైల్ సేవలను అర్థరాత్రి వరకు పొడిగించగా.. తాజాగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. GHMC పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15-30 బస్సులను నడపనున్నట్లు తెలిపింది. భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ సైతం ఈ బస్సుల్లో అందుబాటులో ఉంటుంది. మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి ఆయా స్పెషల్ బస్సుల్లో ప్రయాణించవచ్చు.