Danam Nagender : నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా..ఎవరికీ భయపడను..దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ భయపడనని అని.. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని తేల్చి చెప్పారు. అదే తన బ్రాండ్‌ ఇమేజ్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో దానం హాట్‌ టాపిక్‌గా మారారు.

New Update
Danam Nagender

Danam Nagender

Danam Nagender : ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ భయపడనని అని.. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని ఖరాఖండిగా చెప్పారు. అదే తన బ్రాండ్‌ ఇమేజ్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దానం హాట్‌ టాపిక్‌గా మారారు. ఇక, అంతకుముందు కూడా దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా. నేను ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది.. అదీ నా స్పెషాలిటీ’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

నిండా మునిగినోనికి చలి ఉండదని, పార్టీ మారినపుడు భయపడాల్సిన అవసరం లేదని దానం నాగేందర్ అన్నారు.  పార్టీ మారిన ఎమ్మె్ల్యేలు ఎందుకు భయపడుతున్నారో తనకు తెలియదన్నారు. ప్రజల్లో ఉండి అభివృద్ధి కోసం పనిచేస్తే వాళ్లే కాపాడతారని చెప్పారు. ఉప ఎన్నికను ఫేస్‌ చేసేందుకు తాను రెడీ అని, భయపడేది లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు స్థాయిని మించి మాట్లాడొద్దని, ఉప ఎన్నికలో తన సంగతి వాళ్లు చూసేదేమీ లేదన్నారు. నేను ఏ విషయమైనా డైరెక్ట్‌గానే చెబుతాను. ఎవరికీ భయపడే రకం కాదు. నేను కాంగ్రెస్‌లో  ఉన్నానని ధైర్యంగా చెబుతున్నాను. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం కోసం శ్రమిస్తాను. జీహెచ్‌ఎంసీ వార్డుల విభజన శాస్త్రీయబద్దంగా జరిగింది. దేశంలో హైదరాబాద్ నెంబర్-1గా ఉండటానికి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. హైడ్రా నా సలహాలు పరిగణనలోకి తీసుకుంది. అందుకే పేద, మధ్య తరగతి ఇళ్ల జోలికి వెళ్లడం లేదు అని దానం చెప్పుకొచ్చారు.

గ్లోబల్‌ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించి భారీ బడ్జెట్‌ కేటాయిస్తున్నారన్నారు.  గ్రేటర్‌ హైదరాబాద్‌ అంతటా కాంగ్రెస్‌ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తా. 300 డివిజన్లలో పార్టీ గెలిచి సత్తా చాటుతుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. అలాగే, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఎమ్మెల్యేల గురించి దానంను విలేకరులు ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదన్నారు.

తలసాని కొడుకు ఖైరతాబాద్‌లో పోటీ చేస్తాడన్న ప్రచారంపై దానం స్పందించారు. తలసాని కొడుకుకు ఏమైనా కొమ్ములున్నాయా అని దానం ప్రశ్నించారు. కొమ్ములుంటే  ఆ కొమ్ములతో కొట్లాడతానని చెప్పారు. మంత్రి పదవిపై తానెప్పుడూ ఫోకస్‌ చేయలేదని, తాను గతంలోనే మంత్రిగా పని చేశానని గుర్తు చేశారు. అధికారులంతా తనకు గౌరవమిస్తారన్నారు. అధికారులు తప్పు చేస్తుంటే నిలదీస్తానన్నారు. హైడ్రా విషయంలో ఇదే చేశానని చెప్పారు. కేసీఆర్‌ చేసిన తోలుతీస్తా వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు. కేసీఆర్‌ అంటే తనకు గౌరవమన్నారు. కవిత విషయం బీఆర్‌ఎస్‌ అంతర్గత అంశమని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్‌ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారన్నారు. కేటీఆర్‌కు మాట్లాడే హక్కు  ఉందన్నారు. సీఎం రేవంత్ పరిపాలనపై ప్రజల్లో సానుకూలత ఉందని చెప్పారు. దానంకు ఈసారి డిపాజిట్‌ గల్లంతేనన్న ప్రచారంపై మాట్లాడుతూ మాటలొద్దు ఏం జరుగుతదో వేచిచూస్తే తెలుస్తుందన్నారు. 

ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్‌ తీర్పులు వెలువరిస్తున్న ప్రస్తుత తరుణంలో దానం తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నామని చెబుతున్నారు. అయితే, ఈ పరిణామాలకు భిన్నంగా దానం నాగేందర్ మాత్రం బహిరంగంగా తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నానని అంగీకరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisment
తాజా కథనాలు