CM Revanth Reddy: తెలంగాణ తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సీఎం. ఆధారాలతో సహా ప్రధాని మోదీకి రేవంత్ లేఖ రాశారు. రైతు రుణమాఫీపై మోదీ వ్యాఖ్యలతో ఆశ్చర్యపోయానని అన్నారు. జరుగుతున్న వాస్తవానికి, మోదీ చెప్పిన మాటలకు పొంతన లేకపోవడం తనను బాధించిందని చెప్పారు.
రూ.2లక్షల కంటే ఎక్కువుంటే...
తమ ప్రభుత్వంలో వాగ్దానం చేసిన విధంగా రూ. 2 లక్షల లోపు ప్రతి పంట రుణాన్ని పూర్తిగా మాఫీ చేసామన్నారు సీఎం రేవంత్. 22,22,067 మంది రైతులకు, రూ. 17,869.22 కోట్లతో రుణమాఫీ చేశామన్నారు. ఇది తెలంగాణ ఏర్పడినప్పటి నుండి అతిపెద్ద వ్యవసాయ రుణమాఫీ అని చెప్పారు. రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు త్వరలో రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.
మాది గోల్డెన్ గ్యారెంటీ..
కాంగ్రెస్ గ్యారెంటీ గోల్డెన్ గ్యారెంటీ అని దేశవ్యాప్తంగా రైతులు నమ్ముతున్నారని అన్నారు. తమ ప్రయత్నాలు రైతుల సంక్షేమం పట్ల తమ అంకితభావాన్ని ప్రదర్శిస్తాయని దృఢంగా విశ్వసిస్తున్నానని అన్నారు. వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ చొరవ ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయమైన నమూనాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను చెప్పారు. తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించే ఈ ప్రయత్నంలో మీ పూర్తి సహకారం, మార్గదర్శకత్వాన్ని అభ్యర్థిస్తున్నానని అన్నారు.
మోదీ ఏం అన్నారు?..
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. బంజారాలతో పాటు అట్టడుగు వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేసిందన్నారు. మహారాష్ట్రలోని వదర్భలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ప్రతీ ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని అబద్ధపు హామీలివ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఆరోపణలు చేశారు. తెలంగాణలో కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. కానీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కూడా రైతులకు రుణమాఫీ చేయలేకపోయిందని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ రైతులు రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులను గౌరవించదని.. అసలు వాళ్ల అవసరాలే పట్టించుకోదని మండిపడ్డారు.