/rtv/media/media_files/2026/02/13/fotojet-8-2026-02-13-21-28-15.jpg)
Camp politics begins
Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి. అయితే ఇప్పటివరకు దాదాపు అన్ని మున్పిపాలిటీల ఫలితాలు వెలువడినప్పటికీ సుమారు 40 మున్సిపాలిటీల వరకు ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆయా పార్టీలు స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి గెలిచిన సభ్యులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఇంకా సమయం ఉండటంతో గెలిచిన సభ్యులు చేజారిపోకుండా ఉండటం కోసం వారిని క్యాంపులకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకొనేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఎక్కడైతే గెలుస్తామనే ధీమా ఉన్న మున్సిపాలిటీలకు చెందిన సభ్యులను ఇప్పటికే క్యాంపులకు తరలించగా తాజాగా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలకు చెందిన సభ్యులను క్యాంపులకు తరలిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తమ సభ్యులను క్యాంపులకు తరలించగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా అదేబాటలో సాగుతున్నాయి.
జమ్మికుంట మున్సిపల్ లో కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇరు పార్టీలు ఇండిపెండెంట్ లను క్యాంపులకు తరలించాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, కాగజ్ నగర్ తదితర ప్రాంతాల్లో సంఖ్యాబలం సరిపోవటం లేదనే ఆందోళన కీలక నేతల్లో గూడుకట్టుకుంటోంది. దీన్ని అధిగమించేందుకు స్వతంత్రులతోపాటు కలిసివచ్చేచోట బిఆర్ఎస్ సహా ఇతరులతో సంధి కుదుర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అనేట్లు హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడ స్వతంత్రులు కీలకం కానున్నారు. దీంతో స్వతంత్రులను క్యాంపులకు తరలిస్తున్నారు. ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈనెల 16న ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపాల్టీల్లో ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్.. కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. అయితే దాదాపు40 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడటంతో స్వతంత్ర అభ్యర్థులకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రధాన పార్టీలు వారికి లక్షల్లో ఆఫర్ చేస్తున్నాయి. గెలిచిన వారిని ఆయా పార్టీలు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేజారకుండా రాజకీయ పార్టీలు ముందు జాగ్రత్తగా క్యాంపులను నడుపుతున్నాయి. పలు చోట్ల ఇండిపెండెంట్లకు, ఇతర పార్టీల అభ్యర్థులను బలవంతంగా తరలించడానికి కూడా ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఘర్షణలు చెలరేగుతున్నాయి. కాగా ఇప్పటికే పలు పార్టీల నాయకులు మహారాష్ర్ట, ఉత్తరఖండ్, అయోధ్య తదితర ప్రాంతాలకు తరలివెళ్లారు. వారు నేరుగా 16న ప్రమాణస్వీకరానికి రానున్నారు.
Follow Us