BC Commission: కులగణనకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో కులగణన చేప్పట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా రాష్ట్రంలో అన్ని కులాలకు కులగణన చేపడుతారా?లేదా? అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే.. ఇటీవల బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొందరు సభ్యులతో కలిసి బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిని ఏర్పాటు చేసిన నెలలు గడుస్తున్న కార్యాచరణలో విఫలమైందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. తాజాగా ప్రతిపక్షాలు విమర్శలను తిప్పికొట్టేందుకు.. అలాగే మంత్రి వర్గం కులగణనకు ఆమోదం తెలపడం బీసీ కమిషన్ తన కార్యాచరణను ప్రారంభించేందుకు సిద్ధమైంది. కాగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 నాటికీ రాష్ట్రంలో కులగణన కార్యక్రమం ముగుస్తుందని... ఆతర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
రేపటి నుంచి షురూ...!
తెలంగాణలో జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లపై బీసీ కమిషన్ బహిరంగ విచారణలను రేపటి నుంచి మొదలు పెట్టనుంది. రిజర్వేషన్లను ఫైనల్ చేసేందుకు సామాజిక, ఆర్థిక, విద్య, కుల సర్వేలతోపాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రజల నుంచి సూచనలు తగీసుకోనుంది. రేపు ప్రారంభమై వచ్చే నెల (నవంబరు) 13 వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాలు, రాష్ట్రస్థాయి కమిషన్ కార్యాలయాల్లో సూచనలు తీసుకుంటామని ఇప్పటికే కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి.. కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్ధం చేసింది.
షెడ్యూల్ ఇలా...
ఈ కార్యక్రమాన్ని తొలుత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో కమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్, సభ్యులు జయప్రకాష్, సురేందర్, బాలలక్ష్మి ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్ కు పయనం కానున్నారు. తొలుత బాసర సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి, సాయంత్రం వరకు ఆదిలాబాద్ వెళతారు.
* సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ చేపడతారు.
* 29న నిజామాబాద్, 30న సంగారెడ్డి,
* నవంబరు 1న కరీంనగర్,
* 2న వరంగల్,
* 4న నల్గొండ,
* 5న ఖమ్మం,
* 7న రంగారెడ్డి,
* 8న మహబూబ్‌నగర్,
* 11న హైదరాబాద్ జిల్లాల్లోని కలెక్టరు కార్యాలయాల్లో విచారణ ఉంటుంది.
* 12న కమిషన్ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థలు, కులసంఘాలు, సంక్షేమ సంఘాలు,
* 13న రాష్ట్ర ప్రజలందరితో నిర్వహించే సమావేశాలతో బహిరంగ విచారణ ముగుస్తుంది.
* వీటిల్లో పాల్గొని అభ్యంతరాలు చెప్పలేకపోయిన వారు వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా నవంబరు 13 వరకు కమిషన్ కార్యాలయానికి పంపించవచ్చు.