ఉద్యమనేత సాయిచంద్ హఠాన్మరణం తర్వాత...తన భార్య రజనీకి తెలంగాణ సర్కార్ న్యాయం చేస్తూ తక్షణం చైర్‌పర్సన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ జానపద కళాకారుడిగా తనదైన శైలీలో పాటలు పాడి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా.. క్రియాశీలక పాత్రను పోషించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సాయిచంద్ బీఆర్ఎస్ విధానాలు, సంక్షేమ పథకాలపై పాటల రూపంలో పాటలు ఆలపిస్తూ జనాన్ని చైతన్యపరిచారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా నియమించిన బీఆర్‌ఎస్ సర్కార్
బీఆర్ఎస్‌తో పాటు తెలంగాణ సమాజానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా కేసీఆర్ సర్కార్ నియమించింది. ఆ పదవిలో ఉన్న సాయిచంద్ చిన్న వయసులోనే గుండెపోటుతో లోకాన్ని శాశ్వతంగా వీడారు.ఈ నేపథ్యంలో సాయిచంద్ భార్య రజనీకి భర్త పదవినే ఇవ్వడం గమనార్హం. గురువారం గిడ్డంగుల కార్యాలయంలోని ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించగా, మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్, చైర్మన్లు ఆంజనేయులు గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే భగత్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, భారత్ రాష్ట్ర సమితి నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అభినందనలు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు
ఈ సందర్భంగా నూతనంగా చైర్మన్ బాధ్యతలు తీసుకున్న రజనీ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ తమ కుటుంబానికి అండగా నిలిచారన్నారు. తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌కి ఎప్పుడు రుణపడి ఉంటుందన్నారు. ఇవాళ ఉదయం నాంపల్లిలోని ఆ సంస్థ కార్యాలయంలో రజనీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.