మంత్రి ఎర్రబెల్లి తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి పాల్గొని నియోజకవర్గ అభివృద్ధి పనులపై మాట్లాడారు. అనంతరం కార్యకర్తలతో ముచ్చటించారు.
కరువు కాటకాలతో విలవిలలాడిన కొడకండ్ల ప్రస్తుతం అభివృద్ధితో కళకళలాడుతున్నదన్నారు. సమైక్య పాలనలో రైతులు, కూలీలు ఇతర ప్రాంతాలకు వలస పోయారని , సీఎం కేసీఆర్ చొరవతో జరిగిన అభివృద్ధిని చూసి వాపస్ వస్తున్నారని పేర్కొన్నారు. వచ్చిన వారంతా వ్యవసాయం, ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని వెల్లడించారు. వ్యవసాయం దండుగ కాదు పండుగగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.
చేనేత కార్మికుల కోసం, ఆ వృత్తి మీద ఆధార పడి జీవిస్తున్న అనేక మందికి ఉపాధి కలిగే విధంగా కొడకండ్ల లో మినీ టెక్ట్స్‌టైల్ పార్క్‌ను మంత్రి కేటీఆర్‌తో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పాలకుర్తి నియోజకవర్గంలోనే కుట్టు శిక్షణ చేపట్టానని తెలిపారు. అనంతరం శివరాత్రి ఇద్దయ్య స్మారకార్థం వారి కుటుంబం కొడకండ్ల గ్రామ పంచాయతీ కి డెడ్ బాడీ ఫ్రీజర్ ను మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.