అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ…కరీంనగర్‌లో అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కరీంనగర్‌లో పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్‌ని బలహీనపరిచారని మంత్రి గంగుల విమర్శించగా.. ఓటమి భయం పట్టుకుందని పొన్నం తిప్పికొట్టారు. ఇరు పార్టీల శ్రేణులు పోటాపోటీ నిరసనలతో రాజకీయాన్ని వేడెక్కించారు.కరీంనగర్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సాధారణ ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ రాజకీయ నేతలు విమర్శలకు పదునుపెడుతున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా మంత్రి గంగుల మండిపడ్డారు. పొన్నం రాజకీయ అసమర్ధుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్‌ను ప్రజలు పూర్తిగా మర్చిపోయారని యువతరం గుర్తుపట్టే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
నాపై హైకోర్టులో సీబీఐ, ఈడీ, కోర్టు కేసులు
బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ ఇద్దరు నాపై హైకోర్టులో కేసు వేశారు. సీబీఐ, ఈడీ, కోర్టు కేసులు అన్ని వేసింది వీరిద్దరే. పొన్నం పేరు తియ్యకండి ఆయన అవుట్‌డేటెడ్. 60 వార్డుల్లో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు సున్నా. దానికి కారణం పొన్నం ప్రభాకర్ ఇంకా దాని గురించి నేను ఏం మాట్లాడాలి. కరీంనగర్ చరిత్రలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాకుండా ఉందా అంటే ఉంది దానికి కారణం పొన్నం ప్రభాకర్ కదా. ఇంకా ఆయన వాల్యూ గురించి నేనేం చెప్పాలి. నేను ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పోను కానీ నా దగ్గరికి వస్తే మాత్రం వదలను. నువ్వు బీజేపీని గెలిపించావు. గంగుల కమలాకర్ అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై మాజీ ఎంపీ పొన్నం తీవ్రంగానే స్పందించారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కరీంనగర్‌లో పోటీగా వస్తున్నారనే భయంతోనే ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి గంగులకు ఓటమి ఖాయమైందని జోస్యం చెప్పారు.
ఆయన్ను అడ్డం పెట్టుకుని నన్ను అవుట్‌డేటెడ్ అంటారా..?
కరీంనగర్‌లో గుంగులకు వినోద్ కుమార్ పోటీ వస్తున్నారు. ఆయన్ను అడ్డం పెట్టుకుని నన్ను అవుట్‌డేటెడ్ అన్నారు. ఈ మాటా వినోద్‌కు దెబ్బ తగిలేటట్టుగా అన్నారా అని నా అనుమానం. కర్ణాటక ఎన్నికల తర్వాత నీలాంటి వారి గడీలు కూలగొట్టి రోడ్లమీద పరిస్థితి మీకు వస్తుంది. ప్రజలు, భూదేవి కూడా మీ భారం భరించలేకపోతుంది. వాస్తవమే మా పార్టీ కొంచెం బలహీనంగా ఉంది మాట్లాడే ముందు కొంచెం మంచి చెడు ఆలోచన చెయ్యాలని పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ…మేయర్ సునీల్‌రావుతో పాటు కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఓటమి ఎరుగని నాయకుడు గంగులను విమర్శించే స్థాయి ప్రభాకర్‌కు లేదని నినాదాలు చేశారు. మంత్రి గంగుల వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో పాలాభిషేకం చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌లా, పొన్నం పార్టీలు మారలేదని స్పష్టం చేశారు.