గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై జడ్పీ చైర్ పర్స్ సరిత వర్గీయులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మరో వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఈ రోజు మంత్రి జూపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టులను పరిశీలించేందుకు వెళ్తుండగా సరిత వర్గీయులు అడ్డుకున్నారు. జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సరితకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారంటూ వారు మంత్రితో వాగ్వాదానికి దిగారు. గద్వాల పట్టణంలోని పట్టణంలోని చింతలపల్లి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. అయినా.. సరిత వర్గీయులు వెనక్కు తగ్గకపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
బీఆర్ఎస్ నుంచి జడ్పీ చైర్ పర్సన్ గా ఎన్నికైన సరితా తిరుపతయ్య గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను సరిత చూస్తూ వస్తున్నారు. కానీ.. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. దీన్ని సరిత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఓ దశలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ సొంతగూటికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. కేటీఆర్ ను కలిశారు.
దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ ఆయనతో చర్చలు జరిపింది. కాంగ్రెస్ లోనే కొనసాగించేలా ఒప్పించింది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకు సీఎం రేవంత్ ఒప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో తనకు ప్రాధాన్యత తగ్గుతుందేమోన్న ఆందోళనలో సరిత ఉన్నారు. దీంతో ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది పాలమూరు పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది.