ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనను కలిగిస్తున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థినిల ఆత్మహత్య ఘటన మరువక ముందే తాజాగా... నిజామాబాద్‌లో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆర్మూర్‌లోని ఎస్సీ బాలికల హాస్టల్లో రక్షిత అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆర్మూర్‌లోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో రక్షిత మూడవ సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం.
హాస్టల్‌లో ఉండే తోటి విద్యార్థినిల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్ధానిక ఆస్పత్రికి తరలించారు. రక్షిత ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విద్యార్థిని స్వస్థలం మెండోరా మండలకేంద్రం. రక్షిత అకాల మృతి వార్త తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కాగా.. గతవారం బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఒకరు బాత్రూమ్‌లో ఉరివేసుకోగా.. మరొకరు హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అయితే చదువుకునేందుకు వెళ్లిన తమ బిడ్డలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రుల దు:ఖానికి అంతే లేకుండా పోతోంది. అంతేకాదు. వరుస ఘటనల పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.