తల్లి లేదు, తండ్రి రాడు.. అయినా షాపులో పనిచేస్తూ విజేతగా..

New Update

చాలామంది తమ కలలను నిజం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు. మరికొంతమంది ఫైనాన్సియల్‌గా బాగున్నా సరే.. వాటిని సాకారం చేసుకునే క్రమంలో చాలామంది ఏదో ఒక సాకు చెప్తూ తప్పించుకుంటారు. కానీ, అలేఖ్య మాత్రం అలా కాదు...తన జీవితంలో ఎంతో విషాదం చవిచూసినా వాటన్నింటిని ఎదిరించి నిలబడింది. తాను అనుకున్న లక్ష్యాన్ని మొత్తానికి సాధించి తన సత్తా ఏంటో చూపించి అందరికి ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఈ అమ్మాయి ఏం చేసిందో తెలియాలంటే మాత్రం పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే...

nidamanuru-model-school-student-alekhya-success-story

జీవితంలో అనుకున్నది సాధించాలన్నా.. లక్ష్యాలను చేరలన్నా ఎంతో కష్టపడాలి. అందుకోసం అలుపెరగని యుద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మందికి కోరుకున్నది సాధించడానికి పెద్ద ఇబ్బందులు ఉండవు. కానీ, వారు విజయాన్ని వాయిదా వేసేందుకు ఎక్కడలేని కారణాలను చెబుతూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, పట్టుదల ఉన్నవాళ్లు మాత్రం సాకులు వెతకరు.. కన్నీళ్లను కూడా దిగమింగి అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఇంధనంగా వాడుకుంటారు. అలాంటి కోవకు చెందిందే అలేఖ్య అనే అమ్మాయి. ఆమె జీవితంలో కావాల్సినన్ని కష్టాలు ఉన్నాయి. కానీ, అన్నింటినీ అధిగమించి విజేతగా నిలిచి అందరికి స్పూర్తిగా నిలిచింది.

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొత్తలాపురానికి చెందిన కట్టెబోయిన వెంకటయ్య, లక్ష్మమ్మ దంపతుల కుమార్తే అలేఖ్య. తల్లికి అనారోగ్యం అని తెలియగానే కన్నతండ్రి వీరిని వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అలేఖ్యను తీసుకుని లక్ష్మమ్మ పుట్టింటికి వచ్చేసింది. తల్లికి భారం కాకుండా అలేఖ్య ఆరో తరగతి నుంచే నిడమానూరు వసతి గృహంలో ఉంటూ.. ఆదర్శ పాఠశాలలో చదువుకుంటోంది. ఆమె పదో తరగతికి వచ్చేసరికి తల్లి ఆరోగ్యం క్షీణించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే మానసికంగా కృంగిపోతారు. తమ కష్టం వినేవాళ్లే లేరా.. తనను ఆదుకునేది ఎవరూ అంటూ పెద్దవాళ్లు సైతం కంగారు పడతారు.

కానీ, అలేఖ్య మాత్రం కొండంత బాధను గుండెల్లోనే దాచుకుంది. ఎంతో కష్టపడి ఏప్రిల్ నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు రాసింది. ఏదో మొక్కుబడిగా రాసి వచ్చేయడం కాదు.. 9.7 జీపీఏతో పరీక్షల్లో తన సత్తాను చాటింది. అలేఖ్య పరిస్థితి తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు కొంత ఆర్థికంగా సహాయం చేశారు. భవిష్యత్ లో అలేఖ్య చదువుకు సంబంధించి కూడా తమవంతు సాయం చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం అలేఖ్య హైదరాబాద్ లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. అలేఖ్య కుటుంబ నేపథ్యం, ఆమెకు ఎదురైన సమస్యలు, ఆమె సాధించిన విజయం తెలుసుకుని అంతా శభాష్ అంటూ తారీఫ్ చేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe