మణికొండలోని జొల్లి కిడ్స్ ప్లే స్కూల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్లే స్కూల్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో ప్లే స్కూల్‌లోని చిన్నారులు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది పిల్లలను పాఠశాల నుంచి బయటకు పంపించారు. ఘటన ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పాఠశాల పిల్లలకు ఎలాంటి హాని జరగలేదని ప్లే స్కూల్ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు జొల్లి కిడ్స్ ప్లే స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వారి పిల్లల భద్రతపై ఆరా తీశారు.
అంతేకాకుండా వారి పిల్లలను అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. మరోవైపు ప్లే స్కూల్ సిబ్బంది పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ప్లే స్కూల్‌లో 100 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పాఠశాల యాజమాన్యం, పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు గుర్తించారు. తరగతి గదిలోని ఏసీ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో చిన్నారులు ఉపయోగించే పలు బొమ్మలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.