Telangana State New Emblem : తెలంగాణ రాష్ట్ర కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. కొత్త చిహ్నంపై ఇంకా చర్చలు జరుగుతుండడంతో జూన్ 2న ఆవిష్కరణకు బ్రేక్ పడింది. దీంతో ఆ రోజు కేవలం రాష్ట్ర గీతం (Telangana State Song) మాత్రమే విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై కూడా సర్కార్ సమాలోచనలు చేస్తోంది. కాగా తెలంగాణ చిహ్నాన్ని మార్చడాన్ని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు ఛార్మినార్ వద్ద కొత్త తెలంగాణ రాష్ట్ర చిహ్నాం ఆవిష్కరణకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. మరోవైపు బీజేపీ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణ రాష్ట్రీయ గీతానికి మద్దతూ ప్రకటించింది. సీఎం రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను, తమ పార్టీ స్వాగతిస్తుందని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.
కొత్త లోగో అంటూ..
తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం రూపకల్పన తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ కొత్త రాష్ట్ర చిహ్నం ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమరవీరుల ప్రతీకగా అమరవీరుల స్థూపాన్ని కొత్తగా రూపొందించిన లోగోలో పెట్టారు. కాగా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈరోజు సచివాలయంలో సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర చిహ్నం, గీతంలపై ప్రభుత్వ నిర్ణయాలను రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ వివరించనున్నారు.