ఇదేం వాన బాబోయ్.. రాష్ట్ర చరిత్రలో భారీ వర్షపాతం ఎక్కడ నమోదైందంటే..?

తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో ఒక్కరోజులోనే 64.98 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. ఇక రాష్ట్రంలోని 35 చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ, 200 చోట్ల 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

New Update
ఇదేం వాన బాబోయ్.. రాష్ట్ర చరిత్రలో భారీ వర్షపాతం ఎక్కడ నమోదైందంటే..?

తెలంగాణను వరుణుడు ఓ ఆటాడుకుంటున్నాడు.. గ్యాప్‌ ఇవ్వకుండా బాది పడేస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా వాన దేవుడు వీర లెవల్‌లో రెచ్చిపోతున్నాడు. వర్షం దెబ్బకు ఊర్ల రూపురేఖలే మారిపోతున్నాయి. ముఖ్యంగా ములుగు జిల్లాలో రికార్డయిన వర్షపాతం తెలంగాణ చరిత్రలో నెవర్‌ బిఫోర్‌. ఒక్క రోజులోనే ఏకంగా 64.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో ఇంతటి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇది తెలంగాణ హిస్టరీలో ఒక్కరోజులో రికార్డయిన అత్యధిక వర్షపాతం. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 61.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

గత రికార్డులు బద్దలు:
2013లో జూలై 19న ములుగు జిల్లాలోని వాజీడు మండలంలో ఒక్కరోజులోనే 51.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు ఒక్కరోజులో రికార్డయిన అత్యధిక వర్షపాతం ఇదే. అయితే తాజాగా ఆ రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఇక రాష్ట్రంలోని 35 చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ, 200 చోట్ల 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం రికార్డయింది. ఎక్కువగా గోదావరి ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లోనే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యాయి. అటు భద్రాచలం వద్ద అడుగుల స్థాయి పెరుగుతూనే ఉంది. ఇక రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాలను వర్షాలు ఇంకా ముంచెత్తుతూనే ఉన్నాయి. గోదావరి నదీ ప్రవాహ పొడవునా లోతట్టు ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాలకు ముప్పు వాటిల్లుతోంది. చెల్పూర్, రేగొండ, మొగుళ్లపల్లిలో అత్యధికంగా వరుసగా 47.58 సెంటీమీటర్లు, 46.70 సెంటీమీటర్లు , 39.40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ప్రాణాలు పోతున్నాయ్:
అటు ములుగు జిల్లాల్లో వర్షాల ధాటికి ఆరుగురు మరణించారు. ములుగు-ఏటూరునాగారం మండలంలో జంపన్న వాగు పొంగిపొర్లడంతో ముగ్గురు మృతి చెందగా, చెరువు కట్ట తెగిపోవడంతో మరో ముగ్గురు కొట్టుకుపోయారు. మహబూబాబాద్ జిల్లాలో వరద ఉధృతిని దాటేందుకు ప్రయత్నించి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. హన్మకొండ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరొకరు మృతి చెందారు. వరంగల్ (warangal) , ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, కరీంనగర్, నిజామాబాద్ (nizamabad) జిల్లాల్లో పదుల సంఖ్యలో గ్రామాలు ముంపునకు గురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11,000 మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలను మూసివేశారు. ప్రభుత్వం కూడా రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్‌లతో పాటు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు