ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో నేతలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. నకిరేకల్ లో 68 వేల ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించిన వేముల వీరేశం నిన్న నియోజకవర్గ కేంద్రంలో భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీకి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొంగులేటి రాష్ట్రంలోని పేదలకు శుభవార్త చెప్పారు. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన 'ఇందిరమ్మ ఇండ్లు' పథకాన్ని సంక్రాంతిలోపు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Telangana: నీటి పారుదల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..!
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామన్నారు. ఆగిపోయిన ప్రాజెక్టుల నిర్మాణాలను సైతం త్వరలోనే పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేశామన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు తిన్నదంతా కక్కించి ప్రజలకు పంచుతామని ప్రకటించారు పొంగులేటి.
15 రోజుల్లో రాష్ట్రం నుంచి డ్రగ్స్ మాఫియాను తరిమికొడతామన్నారు. ఈ నెల 28న మరో రెండు గ్యారెంటీలను అమలు చేయనున్నట్లు చెప్పారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. అందరినీ కలుపుకుని నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు.