అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం అయినటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చిరుధాన్యాల లడ్డూ ప్రసాదం, బంగారం, వెండి నాణేల( డాలర్) విక్రయాల వెబ్ పోర్టల్, ఆన్‌లైన్ టికెట్ సేవలను బుధవారం రోజున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం దేవాలయాన్ని కలియ తిరిగారు. స్వామివారి సేవలో పాల్గొనగా దేవాలయ అర్చకులు తీర్దప్రసాదాలు అందించారు.
అంతకుముందు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ ఈఓ, అర్చకులు స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభువు శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని.. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు.
అనంతరం బంగారు నాణెంను ఈవో గీత.. వెండి నాణెంను ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి.. చిరుధాన్యాల లడ్డూను దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ జ్యోతి కొనుగోలు చేయగా వారికి మంత్రి అందజేశారు. బంగారు డాలర్ 3 గ్రాముల ధర రూ.21,000 లుగా నిర్ణయించగా.. వెండి 5 గ్రాములు రూ.1,000, మిల్లెట్ ప్రసాదం 80 గ్రాములు రూ. 40./ లుగా దేవస్థానం నిర్ణయించింది. అనంతరం స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని దేవాలయ సిబ్బందిని కోరారు.