మెడికల్ కాలేజీ విద్యార్ధి మృతిపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు సోమిరెడ్డి, కరుణ. వీరిది ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల గ్రామం. వారు అక్కడి నుంచి 20 ఏళ్ల క్రితం హైదరాబాదు శివారులోని పాపిరెడ్డి నగర్ కి వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు దీక్షిత్ రెడ్డి మెడిసిన్ చదువుతున్నాడు. దీక్షిత్ రెడ్డికి మానసిక స్థితి సరిగా లేదు. దీంతో గతంలో కూడా ఒకసారి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
ఆ సమయంలో కుటుంబ సభ్యులు గమనించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.దీంతో తల్లిదండ్రులు అతనికి మెరుగైన చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే మందులు తీసుకోవాల్సి వస్తుందని దీక్షిత్ రెడ్డి మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులందరూ బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లోనే దీక్షిత్ రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాయంత్రం ఐదు గంటలకి కుటుంబసభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు పెట్టి ఉన్నాయి. దీక్షిత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నా ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తీయలేదు.
దీంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా దీక్షిత్ రెడ్డి ఇంట్లోనే రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. అంబులెన్స్‌లో వైద్య సిబ్బంది వచ్చి చూసేసరికి దీక్షిత్ రెడ్డి మర్మాంగం కోసుకున్నట్లు తేలింది. అప్పటికే అతను మృతి చెందాడని 108 సిబ్బంది కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో దీక్షిత్‌రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. తన కొడుకు డాక్టర్ అవుతాడనుకుంటే ఇలా తమ కళ్ల ముందే మృత్యు ఒడిలోకి చేరుకోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.