బల్కంపేట అమ్మవారి ఎదుర్కోలులో భాగంగా దేవస్థానం నుంచి బయలుదేరి ఎస్‌ఆర్‌నగర్‌లోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు చేరి తిరిగి యథాస్థానికి చేరుస్తారు. 20వ తేదీ ఉదయం 4 గంటలకు నాదస్వర మంగళ వాయిద్యాలు, అభిషేకం, ఉదయం 8 గంటలకు స్థాపిత దేవతా పూజలు, మహావిద్య చండీ మూలమంత్ర అనుష్ట్రానములు, వేదపారాయణం ఉదయం 11:55 నిమిషాలకు అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి కల్యాణ మంగళహారతులు సాయంత్రం 6 గంటలకు స్థాపిత దేవతా అనుష్టానములు నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు నీరాజన హారతి మంత్ర పుష్పములు, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. 21వ తేదీ ఉదయం 5 గంటలకు నాదస్వర మంగళ వాయిద్యాలు, అభిషేకం, ఉదయం 9 గంటలకు స్థాపిత దేవతాపూజలు, అగ్ని ప్రతిష్ఠ గణపతి హోమం, స్థాపిత దేవతా మూలమంత్ర హవనంములు, మహాశాంతి చండీ హోమం కలశోద్వాసనం ఉదయం 11:30 గంటలకు బలిహరణ, పూర్ణాహుతి, మహానివేదన, సాయంత్రం 4 గంటలకు పారాయణములు, రథ అధిష్టాన దేవతల ఆహాన పూజ, సాయంత్రం 6 గంటలకు అమ్మవారి రథోత్సవం ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి. ఎల్లమ్మ తల్లి కల్యాణానికి ప్రభుత్వం తరుఫున మంత్రలు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.
కల్యాణానికి పంచరంగులతో చేనేత చీరలు
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం కోసం పోచంపల్లి చేనేత కళాకారుల, తెలంగాణ పద్మశాలీ మేళా కమిటీ చైర్మన్ జయరాజ్ ఆధ్వర్యంలో ఆరుగురు చేనేత కళాకారులు పంచరంగుల పట్టు చీరలను ఆలయ ప్రాంగాణంలో మగ్గంపై నేస్తున్నారు. రూ. 50 వేల విలువ గల రెండు చీరలను ఈ నెల 19 వరకు అందజేస్తామని జయరాజు తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ఆలయ పరిసరాల్లో 3 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
- బేగంపేట గ్రీన్ ల్యాండ్ నుంచి వచ్చే వాహనాలను మాతా టెంపుల్ సత్యం టాకీస్ మీదుగా ఎస్‌ఆర్‌నగర్ టీ జంక్షన్ ఫతేనగర్ వైపు మళ్లిస్తారు.
- ఫతేనగర్ నుంచి వచ్చే వాహనాలను కొత్త బ్రిడ్జి నుంచి కట్ట మైసమ్మ ఆలయం మీదుగా బేగంపేట వైపు మళ్లిస్తారు.
- గ్రీన్‌ల్యాండ్ బకూల్ అపార్ట్‌మెంట్ నుంచి వచ్చే వాహనాలను ఫుడ్ వరల్డ్ ఎక్స్ రోడ్ మీదుగా ఎస్‌ఆర్‌నగర్ టీ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- బేగంపేట కట్టమైసమ్మ నుంచి వచ్చే వాహనాలను గ్రీన్ ల్యాండ్, ఎస్‌ఆర్‌నగర్ టీ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.
- కల్యాణోత్సవం ముగిసే వరకు లింక్ రోడ్లను పూర్తిగా మూసి వేస్తారు.
పార్కింగ్ ప్రదేశాలు
ఎల్లమ్మ కల్యాణం వీక్షించేందుకు వాహనాలలో వచ్చే భక్తుల సౌకర్యార్థం 6 చోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఇందులో ఎస్‌ఆర్‌నగర్‌లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయం, ప్రకృతి చికిత్సాలయం, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, పద్మశ్రీ నేచర్ క్యూర్ ఆస్పత్రి రోడ్, ఫతేనగర్ రైల్వే స్టేషన్, రోడ్లు భవనాల కార్యాలయానికి వెళ్లే పద్మశ్రీ అపార్ట్‌మెంట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.