ప్రజాపాలన దరఖాస్తులు (Praja Palana Applications) రోడ్డుపై కనిపించడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇందుకు కారణమైన వారిపై చర్యలకు ఉపక్రమించింది. హయత్‌నగర్ వాల్యూయేషన్ అధికారి మహేందర్ పై సస్పెన్షన్ వేటు వేసింది సర్కార్. కుత్భుల్లాపూర్ నోడల్ ఆఫీసర్ పై కూడా ప్రభుత్వం వేటు వేసినట్లు తెలుస్తోంది. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ బాధ్యలను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. దీంతో వారు తమ ఇళ్లకు దరఖాస్తులను తీసుకెళ్లి డేటా నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దరఖాస్తుల్లో ఆధార్ (Aadhaar), రేషన్ కార్డు(Ration Card), ఫోన్ నంబర్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో బ్యాంక్ ఖాతా నంబర్ల వివరాలను సైతం అధికారులు సేకరించారు. దీంతో ఈ డేటా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. సైబర్ నేరగాళ్ల చేతికి ఈ డేటా వెళ్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
దరఖాస్తులు రోడ్డుపైకి ఎందుకు వచ్చాయి?
హయత్ నగర్ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్ల డేటా ఎంట్రీ కోసం కూకట్ పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అధికారులు అప్పగించారు. డేటా ఎంట్రీ చేసినందుకు ఒక్కో అప్లికేషన్ కు రూ.5 ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓ వ్యక్తి రాపిడో వాహనం మీద అట్టా పెట్టెలో తీసుకు వెళ్తుండగా తాడు తెగి దరఖాస్తులు అన్నీ రోడ్డుపై పడ్డాయి. దీంతో అక్కడ ఉన్న వారు వాటిని ప్రజాపాలన దరఖాస్తులుగా గుర్తించారు.
ఇవి మీ చేతుల్లోకి ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. ఈ రోజు ఉదయం నుంచి ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రజలకు సైబర్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ప్రజా పాలనలో ఇటీవల అనేక మంది వివిధ స్కీమ్స్, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో..
సైబర్ నేరగాళ్లు ఇదే అదనుగా మోసం చేసేందుకు ప్రయత్నాలు చేయవచ్చని హెచ్చరించారు. ఎవరైనా ఫోన్ చేసి మీకు రేషన్ కార్డు వచ్చింది, ఆ పథకంలో మీ పేరు వచ్చిందంటూ చెబితే నమ్మవద్దని తెలిపారు పోలీసులు. అలా నమ్మి ఓటీపీలు చెప్పి మోసపోవద్దని హెచ్చరించారు.