Telangana Pensions: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అనర్హుల నుంచి ఆసరా పెన్షన్ రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల నుంచి రికవరీ కోసం నోటీసులు ఇచ్చింది. అనర్హుల జాబితాను అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 200 మంది నుంచి రికవరీ చేయాలని ఆదేశం ఇచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు ఆసరా పథకం పేరిట పెన్షన్ పంపిణీ చేసింది గత ప్రభుత్వం. రిటైరైన ఉద్యోగులు సైతం ఆసరా పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. నోటీసు అందిన ఏడు రోజుల్లో పెన్షన్ మొత్తం చెల్లించాలని లేనిపక్షంలో అన్నిరకాల పెన్షన్లను నిలుపుదల చేయాలని ఆదేశం ఇచ్చింది. దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలు గతంలో పొందిన రూ.1,72,928లను తిరిగి చెల్లాంచాలని నోటీసు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్‌ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 42 మంది ఆసరా లబ్ధిదారులకు పెన్షన్ రికవరీ నోటీసులు జారీ చేశారు అధికారులు. ఆందోళనలో ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, బీడీ వర్కర్లకు ఆసరా కింద రూ. 2016, దివ్యాంగులకు రూ. 4,116 ఆర్థిక సాయం అందించింది గత ప్రభుత్వం. తాజాగా చేయూత పేరిట రాష్ట్ర వ్యాప్తంగా వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు 4,000, దివ్యాంగులకు 6000 పంపిణీ చేయాలన్న యోచనలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఉంది. డైరెక్టరీ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంటెట్స్ విభాగం నుంచి ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల వివరాలను సమగ్ర కుటుంబ సర్వే డేటాతో సరిపోల్చి చూసింది ప్రభుత్వం.