TG News: జలాశయాల్లో పూడికలకోసం గ్లోబల్ టెండర్లు.. ఇసుక, మట్టి ఖనిజాలే ఆదాయ వనరు!

రాష్ట్రంలోని నీటి పారుదల జలాశయాల్లో పూడికతీత పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. పనులను గ్లోబల్ టెండర్లకు అప్పగించి, ఇసుక, మట్టితో ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది.

New Update
TG News: జలాశయాల్లో పూడికలకోసం గ్లోబల్ టెండర్లు.. ఇసుక, మట్టి ఖనిజాలే ఆదాయ వనరు!

Telangana: తెలంగాణలోని జలాశయాల పూడిక తీతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. నీటి పారుదల జలాశయాలలో పూడిక తీత పనులను పకడ్బందీ ప్రణాళికతో చేపట్టాలని నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో సబ్ కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటి పారుదల, రెవిన్యూ, ఖనిజాభివృద్ది శాఖల ఉన్నతాధికారులు సమవేశమై పూడికలపై చర్చలు జరిపారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో కాంట్రాక్టర్లు ఆహ్వానించి, గ్లోబల్ టెండర్లు పిలిచి పనులను అత్యంత పారదర్శకంగా చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఆ ఆదాయంతో రిజర్వాయర్ల నిర్వహణ పనులు..
జలాశయాలలో పూడిక తీత పనులను ఈపిసి విధానంలో చేపడితే నిర్ణయించిన సమయానికి పనులు పూర్తి అవుతాయని పేర్కొన్నారు. ఖనిజాభివృద్ది సంస్థ జలాశయాలలో ఉన్న ఇసుక, మట్టి నిల్వలను అంచనా వేసి ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చేలా అంచనాలు రూపొందించనున్నట్లు తెలిపారు. జలాశయాలలో ఉన్న ఇసుక, మట్టి ఖనిజాలు ద్వారా వచ్చే ఆదాయంతో రిజర్వాయర్ల నిర్వహణ పనులను చేపట్టబోతున్నట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అన్ని జలాశయాలలో పూడిక తీత పనులను చేపట్టి అత్యంత వేగంగా పనులు పూర్తి చేయాలి. ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా పూడిక తీత పనులు జరిగేలా చూడాలి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులు చేపట్టి జలాశయాలలో పూడికతీత పనులను విజయవంతంగా పూర్తి చేసి జలాశయాలలో నీటి నిల్వలు పెరిగేలా కృషి చేయాలి. జలాశయాలు పటిష్టంగా వ్యవసాయానికి మరింత ఉపయోగకరంగా ఉండేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.

Advertisment
తాజా కథనాలు