ఈ రోజు గాంధీభవన్ లో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పీఏసీ సమావేశంలో మూడు తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతు మొదటి తీర్మానం చేశారు. సోనియా (Sonia Gandhi), ఖర్గే, రాహుల్, ప్రియాంక, జాతీయ నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ రెండో తీర్మానం చేశారు. తెలంగాణలో సోనియా పోటీ చేయాలని మూడో తీర్మానం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి షబ్బీర్ అలీ వెల్లడించారు. గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియాకు రుణపడి ఉంటామన్నారు. అనంతరం ఆరు గ్యారంటీలపై చర్చించినట్లు చెప్పారు షబ్బీర్ అలీ. మిగిలిన గ్యారంటీలపై అసెంబ్లీలో సీఎం ప్రకటిస్తారన్నారు.
ఇది కూడా చదవండి: Konda Surekha: వారికి రూ.10 లక్షలు.. మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సభ్యులకు డిప్యూటీ సీఎం వివరించారన్నారు. ఇరిగేషన్ అవకతవకలపై ఉత్తమ్ వివరించారని చెప్పారు షబ్బీర్ అలీ. సాగునీటి ప్రాజెక్టులపై వేల కోట్లు ఖర్చు చేసినా ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎలక్ట్రిసిటీ, ఫైనాన్స్, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాగపూర్ లో 28 న జరుగుతుందన్నారు.
ఈ వేడుకలకు రాష్ట్రం నుంచి యాభై వేల మందిని తరలిస్తామన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, హౌసింగ్ పై త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈనెల 28 నుంచి ప్రతీ గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. గ్రామ సభలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. పార్లమెంట్ స్థానాలకు మంత్రులను ఇంఛార్జ్ లుగా నియమించామన్నారు. నామినేటెడ్ పోస్టులను తొందర్లోనే భర్తీ చేస్తామని సీఎం చెప్పినట్లు షబ్బీర్ అలీ వివరించారు.