తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు రెండో విడతలో 1,29,800 మందికి వెనుకబడిన షెడ్యూల్ కులాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. రెండో విడతలో 1.30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని.. లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 1100 మందికి దళిత బంధు అందించడానికి కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 118 నియోజకవర్గాలలో 1,29,800 మందికి ఈ దళిత బంధు పథకాన్ని అందజేయాలనుకుంటున్నది.నిబంధల ప్రకారం.. లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులతో సంప్రదించి ఒక్కో నియోజకవర్గంలో (హుజూరాబాద్ మినహా) 1100 ఎస్సీ కుటుంబాలను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది.
అతి త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షలు పడనున్నాయి. 2023-24 రాష్ట్ర బడ్జెట్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు నిధుల కింద రూ.17,700 కోట్లను కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దళితులు ఆ సంపదను పెట్టుబడిగా పెట్టుకొని.. ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది.