Kalki 2898 AD Ticket Rates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్‌లో వస్తున్న కల్కి 2898 AD సినిమాపై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) పతాకంపై సీనియర్ నిర్మాత అశ్వనీదత్ (Aswani Dutt) అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం కల్కి. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ కల్కి మేకర్స్ వరుస ప్రమోషన్స్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను తమ సినిమా వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం రీసెంట్ గా జర్నీ ఆఫ్ కల్కి పేరుతో ప్రీ ప్రిల్యూడ్ వీడియోలను రిలీజ్ చేశారు. అక్కడే నాగ్ అశ్విన్ సినిమాకి సంబంధించిన అనేక విశేషాలను పంచుకున్నారు. అవి విన్న ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక తాజాగా వచ్చిన కొత్త ట్రైలర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ట్రైలర్ తో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరో స్థాయికి చేరాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.
Kalki Ticket Rates: ఇదిలా ఉంటే కల్కి సినిమా కోసం టికెట్ల ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అనుమతినిచ్చింది. నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజులపాటు టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం ఎస్ చెప్పింది. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కల్కి సినిమా టికెట్ పై గరిష్టంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం సాధారణ థియేటర్లలో రూ.70, మల్టీఫ్లెక్స్ ల్లో రూ.100 టికెట్ రేట్ పెంచుకోవచ్చు. అంతేకాకుండా, 27న ఉదయం 5:30 గంటలకు ప్రత్యేకంగా షో వేసుకోవడానికి షోకు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. మొదటి వారం రోజులపాటు ఐదు షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Kalki Ticket Rates: ఇక ఇప్పటివరకూ ఉన్న అప్ డేట్స్ ప్రకారం కల్కి సినిమాలో దేశవ్యాప్తంగా ఉన్న నటుల్లో టాప్ స్టార్స్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అన్నా బెన్, శోభన, మాళవికా నాయర్, స్వతనా ఛటర్జీ నటిస్తున్నారు. ఇప్పుడు పశుపతి కూడా నటిస్తాడని ప్రకటించారు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. మరి సినిమాలో ఇంకా ఎవరెవరు ఉన్నారో.. మరెన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.