CM Revanth Reddy : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (Telangana Formation Day) నేడు ఊరూవాడా ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం సైతం భారీగా ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 9.30 గంటలకు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 10 గంటలకు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. తర్వాత పోలీసు బలగాల పరేడ్ గౌరవ వందానాన్ని స్వీకరిస్తారు. అనంతరం అందెశ్రీ రచించి, కీరవాణి సంగీతం సమకూర్చిన తెలంగాణ గీతాన్ని జాతికి అంకింతం చేయనున్నారు సీఎం. తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.
సాయంత్రం ట్యాంక్ బండ్ పై..
సాయంత్రం ట్యాంక్ బండ్ పై సంబరాలు నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. లేజర్ షో, ఫైర్ వర్క్స్, కార్నివాల్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. చిన్నారులతో వచ్చేవారికి ప్రత్యేకంగా అమ్యూజ్మెంట్ జోన్, ఫొటో జోన్లను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్ బండ్ కు చేరుకుని స్టాళ్లను సందర్శిస్తారు. 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహణకు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 5 వేల మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఈ సమయంలోనే 13 నిమిషాల జయజయహే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేయనుంది ప్రభుత్వం. తర్వాత కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిని సన్మానించనున్నారు.
సోనియా, కేసీఆర్ కు ఆహ్వానం..
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. అయితే.. అనారోగ్య కారణాలతో ఆమె వేడుకలకు రావడం లేదని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సైతం ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే.. ఆయన ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో పాల్గొనడం లేదు. ఈ మేరకు నిన్న సీఎంకు కేసీఆర్ లేఖ రాశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మూడు రోజుల పాటు వేడుకల నిర్వహణకు షెడ్యూల్ ను ఇప్పటికే ప్రకటించారు. నిన్న రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్ ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి వేడుకలకు రావాలని ఆహ్వానించారు. గవర్నర్ ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఇంకా తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, కవులు, కళాకారులు, మేధావులకు ఆహ్వానం పంపించారు.