ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

గతేడాది తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో భద్రాద్రి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

New Update
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

గతేడాది నవంబర్ 22వ తేదీన చండ్రుగొండ మండలం, ఎర్రబోడు గ్రామ శివార్లలో విధులలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావును విచక్షణారహితంగా నరికి చంపిన ఇద్దరు నిందితులకు శిక్ష పడింది. భద్రాద్రి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ పాటిల్ వసంత్ సంచలన తీర్పు ఇచ్చారు. ఇద్దరు నిందితులకు యావజ్జీవ శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. చండ్రుగొండ మండలం బెండాళపాడు గ్రామ పంచాయతీ ఎర్రబోడు అటవీ ప్రాంతంలో ప్లాంటేషన్ పనులు పరిశీలించడానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు వెళ్లారు. అయితే అక్కడ ఎర్రబోడు గ్రామానికి చెందిన గుత్తి కోయలు ఆయన్ని దారుణంగా హత్య చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

మడకం తుల, పోడియం నంగా అనే ఇద్దరు గిరిజనులు అతి దారుణంగా శ్రీనివాసరావును వేట కొడవళ్లతో గొంతు కోసి హత్య చేశారు. నిందితులపై గతంలో చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే హత్య చేసిన ఇద్దరు నిందితులకు త్వరగా శిక్ష పడే విధంగా పనిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినిత్ అభినందించారు. ఏకంగా ఫారెస్టు అధికారి శ్రీనివాసరావునే హత్య చేయడంతో గొత్తి కోయలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్పటి నుంచి కోర్టులో సాగుతూ వచ్చిన ఈ కేసులో ఎట్టకేలకు జిల్లా న్యాయమూర్తి తుది తీర్పు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అసలు ఏం జరిగిదంటే?

చండ్రుగొండ మండలం బెండలపాడు అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటారు. అయితే ఆ మొక్కలను పీకేందుకు పోడు భూములు సాగుచేసుకునే గుత్తికోయలు గుంపులుగా వచ్చారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు శ్రీనివాసరావు, రామారావులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ గుత్తికోయలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆగ్రహంతో ఉన్న వారు కత్తులు, గొడ్డళ్లతో మూకుమ్మడి దాడి చేశారు. వారి దాడి నుంచి రామారావు తప్పించుకోగా.. శ్రీనివాసరావు ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గం మధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. కేసు విషయంలో తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలంటూ పోలీసులను నివేదిక కూడా కోరింది. దీంతో పాటు 2009లో మహిళా అటవీ అధికారిపై దాడి ఘటనపైనా తీసుకున్న చర్యలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంది. ఈ ఘటన అనంతరం గుత్తికోయలను గ్రామం నుంచి బహిష్కరించాలని బెండలపాడు పంచాయతీ తీర్మానించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు