రైతుబంధు (RYTHU BANDHU) నిధుల విడుదలకు ఎన్నికల సంఘం (Election Commission) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నిధుల విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. ఈ నెల 29, 30 తేదీల్లో మాత్రం విడుదల చేయవద్దని కేంద్రం షరతులు పెట్టింది. ఇంకా ఈ రోజు నుంచే నిధుల విడుదలను ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్ భావించినా.. ఈ రోజు నాలుగో శనివారం, రేపు ఆదివారంతో పాటు సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. దీంతో మంగళవారం ఒక్కరోజు మాత్రమే నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఏర్పడింది. అనంతరం ఎన్నికల తర్వాతనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. మంగళవారం ఒక్కరోజే రైతులందరికీ నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుందా? ఉండదా? అనే అంశంపై చర్చ సాగుతోంది. సాధ్యమైతే ఆ ఒక్కరోజే రాష్ట్రంలోని దాదాపు 70 లక్షల రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనుంది సర్కార్.
ఇది కూడా చదవండి: Telangana Elections 2023:తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
ఈ సీజన్లలో రైతుబంధు స్కీం (Rythu Bandhu Scheme) కింద దాదాపు 71.5 లక్షల మంది రైతులకు రైతుబంధు స్కీం కింద పెట్టుబడి సాయం అందించనుంది కేసీఆర్ సర్కార్. గత ఖరీఫ్ సీజన్‌లో ఈ సంఖ్య 70 లక్షలు. ఈ సారి 1.5 లక్షల మంది పోడు రైతులకు కూడా రైతుబంధు పథకాన్ని వర్తింపజేసింది ప్రభుత్వం. దీంతో లబ్ధిదారుల సంఖ్య 71.5 లక్షలకు పెరిగింది. ఇందుకు సంబంధించిన రూ.7700 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఇప్పటి వరకు ఇలా..
రైతు బంధు సాయాన్ని విడదల వారీగా విడుదల చేసేది సర్కార్. తొలి రోజు ఎకరంలోపు, మరుసటి రోజు రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులకు.. ఇలా వారంలో పంపిణీ పూర్తి అయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసేది. అయితే.. ప్రస్తుతం ఎన్నికల్లోపే పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావించడం, వరుస సెలవులు, ఎన్నికల కమిషన్ షరతుల నేపథ్యంలో ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఈ సారి పంపిణీ పూర్తి చేస్తుందనే అంశంపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.