తెలంగాణలో హోరాహోరీగా సాగిన ఎన్నికలు (Telangana Elections 2023) నిన్న ముగిశాయి. అయితే.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ (TS Exit Polls) కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలంగాణ ఓటర్లు బీఆర్ఎస్ కు మరో ఛాన్స్ ఇవ్వనున్నారని తేల్చాయి. అయితే.. అన్ని ఎగ్జిట్ పోల్స్ లెక్కలను పరిశీలిస్తే హంగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారంపై భారీ ఆశలు పెట్టుకున్న హస్తం పార్టీ అలర్ట్ అయ్యింది. ఒక వేళ మేజిక్ ఫిగర్ దక్కకుంటే ఏం చేయాలనే అంశంపై ఆ పార్టీ అగ్ర నేతలు వ్యూహాలను రచిస్తున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కర్నాటక లేదా హిమాచల్ ప్రదేశ్ కు తరలించాలని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Exit Polls History: ఎగ్జిట్ పోల్స్.. ఎప్పుడు ఎలా ప్రారంభం అయ్యాయో తెలుసా?
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డైరెక్షన్లో ఈ ఆపరేషన్ నిర్వహించాలని ఆ పార్టీ హైకమాండ్ పెద్దలు నిర్ణయించారు. తాము అధికారంలో ఉన్న కర్ణాటకకు ఎమ్మెల్యేలను తరలిస్తేనే సేఫ్ అని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గెలిచే అవకాశం ఉందని భావిస్తున్న అభ్యర్థుల వెంట ఇద్దరు కో-ఆర్డినేటర్లను ఉంచినట్లు సమాచారం. ఫలితాల తర్వాత గెలిచినట్లు సంతకం చేసి సర్టిఫికేట్ తీసుకోగానే ఆయా అభ్యర్థులను క్యాంప్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కర్నాటకలోని హుబ్లీ లేదా హిమాచల్ ప్రదేశ్ సిమ్లాకు వీరిని తరలించాలని రెండు ఆప్షన్లను పెట్టుకుంది హస్తం పార్టీ. సిమ్లాకు తరలిస్తే రాయల్ తులిఫ్ హోటల్, ఐటీసీ అమూహా రీట్రిట్ లో క్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. అదే.. కర్నాటకలోని హుబ్లీకి తరలిస్తే ప్రెసిడెంట్ హోటల్, శ్రీనగర్ ప్యాలెస్, హోటల్ నవీన్ లేక్ సైడ్ లో క్యాంప్‌కు ఏర్పాట్లు సాగుతున్నట్లు సమాచారం.