KCR: జై తెలంగాణ అన్న పాపాన పోలే.. మళ్లా దోఖా చేసేందుకు వస్తున్నరు!

ఎన్నికలు సమీపిస్తుండడంతో కేసీఆర్‌ ఫుల్‌ బిజీ ఐపోయారు వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మక్తల్‌, నారాయణపేట, గద్వాల్‌, దేవరకద్రలో ప్రసంగించిన కేసీఆర్‌.. ప్రజలు విచక్షణతో ఓటేయాలని చెప్పారు. తెలంగాణ భవితకు బీఆర్‌ఎస్‌ శ్రీరామరక్ష అని చెప్పారు.

New Update
KCR: జై తెలంగాణ అన్న పాపాన పోలే.. మళ్లా దోఖా చేసేందుకు వస్తున్నరు!

సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల చొప్పున ఆయన చుట్టి వస్తున్నారు. సోమవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, గద్వాల్‌, మక్తల్‌, నారాయణపేట నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నికలు వస్తుంటాయ్‌, పోతుంటాయన్నారు. గెలుపోటములు సహజమని, అయితే ఎవరికి ఓటేస్తున్నామో ఆలోచించి విచక్షణతో ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌.

దేవరకద్రలో ఏం మాట్లాడారంటే?
ఓటేసే ముందు అన్ని పార్టీల చరిత్ర చూడాలని పాలమూరు ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఎవరో చెప్పారని ఓటు వేయొద్ధని.. ప్రజల వద్ద ఉన్న వజ్రాయుధం ఓటు అని అన్నారాయన. గత ప్రభుత్వాల పాలనలో పాలమూరును ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించిన సీఎం కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన దేవరకద్ర అభివృద్ధితో తమ పార్టీ అభ్యర్థి వెంకటేశ్వర్‌రెడ్డి విజయం ఖాయమైపోయిందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘30 చెక్‌డ్యామ్‌లు మంజూరు చేయించిన నాయకుడు వెంకటేశ్వర్‌రెడ్డి. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి.. అభ్యర్థి వెనక ఉన్న పార్టీ విధానం చూసి ఓటు వేయండి’’ అని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. రాబోయే ఐదేళ్ల కాలం ప్రజల భవిష్యత్ నిర్ణయిస్తుందని, కాబట్టి విచక్షణతో ఓటు వేయాలని ప్రజలను కోరారు.

గద్వాల్‌లో కేసీఆర్ స్పీచ్:
ఘన చరిత్ర ఉన్న గద్వాలను గబ్బు పట్టించిన వారు ఎవరని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కృష్ణా, తుంగభద్ర నడుమ ఉన్న నడిగడ్డ ప్రాంతాన్ని కరువు సీమగా ఆగం చేసిన పార్టీ ఏది అని ప్రశ్నించారు. గద్వాల ప్రాంతంలో వాల్మీకి, బోయ సోదరులుంటారని, వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీలుగా గుర్తించారని ఆయన చెప్పారు. తమ రాష్ట్రంలో వారు బీసీలుగా ఉన్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. రాష్ట్రంలోని వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయమై మోడీ సర్కార్ పై పోరాటం చేయాల్సిందేనన్నారు. నీలం సంజీవరెడ్డి వాల్మీకి, బోయలకు అన్యాయం చేశారని కేసీఆర్ చెప్పారు. ఆంధ్రాలో ఎస్టీల్లో, తెలంగాణలో బీసీల్లో చేర్చి అన్యాయం చేశారన్నారు. ఆనాడు వాల్మీకి, బోయలను ముంచింది కాంగ్రెస్ ముఖ్యమంత్రే అని ఆయన విమర్శలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి మంత్రులు ఏం చేశారో మీకు తెలుసునని చెప్పారు. ఇక్కడి నీళ్లు తీసుకుపోతుంటే హరతి పట్టి రఘువీరారెడ్డికి స్వాగతం పలికిన మంత్రి ఎవరో మీకు తెలుసునని కేసీఆర్ పరోక్షంగా డీకే అరుణపై విమర్శలు గుప్పించారు.

మక్తల్‌లో కేసీఆర్‌ ఏం అన్నారంటే?
సంగం బండ రిజర్వాయర్‌ తెలంగాణ ఏళ్ల కల అన్నారు సీఎం కేసీఆర్‌. కాంగ్రెస్‌, తెలుగు దేశం హయాంలలో ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు సంగంబండ రిజర్వాయర్ నుంచి‌, భూత్పూర్‌ రిజర్వాయర్‌ నుంచి వస్తున్న నీళ్లతోనే 2 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతున్నాయని చెప్పారు. మక్తల్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని మరోసారి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌తో పాటూ మక్తల్‌ ప్రజలు కోరుకుంటున్న అన్ని పనులను బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ వచ్చిన నెల రోజులలోపే 100 శాతం చేయించే బాధ్యత తనదేనని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

నారాయణపేటలో కేసీఆర్‌ కామెంట్స్:
పాలమూరును నాశనం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ అని సీఎం కేసీఆర్‌ ఫైర్‌ అయ్యారు. ‘ఇక్కడి నుంచి ఎంతో మంది మంత్రులు ఉండె.. కానీ ఒక్క పనీ చేయలేదు. ఒక్కడు కూడా జై తెలంగాణ అన్న పాపాన పోలేదు. ఇపుడు మల్ల దోఖా చేసేందుకు వస్తున్నారు. మన భవిష్యత్ బాగుండాలంటే బీఆర్‌ఎస్‌ మాత్రమే శ్రీరామ రక్ష. నారాయణపేట హైదారాబాద్ తర్వాత మున్సిపాలిటీ గా ఏర్పడిన మొదటి పట్టణమని గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీలో నారాయణ పేట ఎడారిని తలపించేదన్నారు. ఏడెనిమిది నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాల్వ పనులు పూర్తవుతాయనీ, నారాయణపేట, కొడంగల్‌, మక్తల్‌ నియోజకవర్గాలకు నీళ్లొస్తాయని తెలిపారు.

Also Read: కామ్రేడ్ల పీఠముడి.. లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు.. తల పట్టుకున్న కాంగ్రెస్!

Advertisment
తాజా కథనాలు